డెట్‌ ఫండ్స్‌..తెలిస్తేనే ఇన్వెస్ట్‌ చేయాలి!

21 Jun, 2021 00:45 IST|Sakshi

క్రెడిట్‌ రిస్క్‌పై అవగాహన అవసరం

ఏఏ, తక్కువ రేటింగ్‌ బాండ్లు ఉంటే రిస్క్‌ తీసుకుంటున్నట్టే

పోర్ట్‌ఫోలియోను వివరంగా చూడాలి

గత పనితీరే ప్రామాణికం కాదు

‘ఈక్విటీల్లో అధిక రిస్క్‌ ఉంటుంది’.. తరచుగా ఈ మాట వింటుంటాం. నిజానికి రిస్క్‌ లేని పెట్టుబడి సాధనాలు చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఆ మాటకొస్తే డెట్‌ ఫండ్స్‌లోనూ రిస్క్‌ ఉంటుంది. ఈక్విటీలను మించిన రిస్క్‌ డెట్‌ ఫండ్స్‌లోనూ ఉంటుందని ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ డెట్‌ పథకాల మూసివేత ఉదంతాన్ని పరిశీలిస్తే అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈక్విటీల్లో రిస్క్‌.. డెట్‌లో రిస్క్‌ లేదన్న అపోహలు వీడాలి.

పెట్టుబడులకు ముందే ప్రతీ సాధనాన్ని అర్థంచేసుకునేందుకు ప్రయత్నిస్తే రిస్క్‌పాళ్లు తెలుస్తాయి. తెలుసుకోకుండా ఏదేనీ సాధనంలో ఇన్వెస్ట్‌ చేశారనుకోండి.. అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటే ఎన్నో ఆకాంక్షలతో చేసిన పెట్టుబడులను తిరిగి పొందడం ఆశగానే మిగిలిపోవచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌ నిపుణుల ఆధ్వర్యంలో నడుస్తుంటాయి కనుక.. పెట్టుబడులు సురక్షితం అనుకోవద్దు.

వారు సైతం తప్పటడుగులు వేయొచ్చు. నియంత్రణ సంస్థలు ఇన్వెస్టర్ల ప్రయోజనాలను అన్ని సందర్భాల్లోనూ కాపాడతాయనుకోలేము. ఇన్వెస్టర్లే తగిన ముందస్తు అధ్యయనం, జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వారి పెట్టుబడులకు రక్షణ సాధ్యపడుతుంది. సెబీ ఇటీవలి ఆదేశాలను పరిశీలిస్తే.. ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ ఉదంతం నుంచి ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన అనుభవాలు కొన్ని కనిపిస్తాయి. ఆ వివరాలే ఈవారం ‘ప్రాఫిట్‌ ప్లస్‌’ కథనంలో...

2018లో క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ విభాగాలకు (కేటగిరీలు) సంబంధించి పునర్‌వ్యవస్థీకరణ చేపట్టింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలను 36 విభాగాలుగా వర్గీకరించింది. దీనివల్ల ఇన్వెస్టర్లు తమకు అనువైన పథకాలను సులభంగా ఎంపిక చేసుకోవచ్చన్నది సెబీ ఉద్దేశం. పథకాల పెట్టుబడుల విధానం పేరులో ప్రతిఫలించేలా సెబీ నాడు చర్యలు చేపట్టింది. అయినప్పటికీ వాస్తవంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల పెట్టుబడులు వాటి పేరును ప్రతిఫలించడం లేదనే ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ తీరు నిరూపించింది.

అందుకే పేరును చూసి మోసపోవద్దు. ఆ పథకం పెట్టుబడుల విధానం ఆయా విభాగం పరిధికి అనుగుణంగా ఉన్నదీ, లేనిదీ ఇన్వెస్టర్లు విచారించుకోవాలి. లో డ్యూరేషన్‌ ఫండ్స్, షార్ట్‌ డ్యూరేషన్‌ ఫండ్స్, లాంగ్‌డ్యూరేషన్‌ ఫండ్స్‌ ఇలా ఎన్నో డెట్‌ విభాగాలున్నాయి. ఇవన్నీ కూడా తక్కువ రిస్క్‌ ఉండేవే. కానీ, అసలు రిస్క్‌ అన్నది ఫండ్‌ మేనేజర్లు ఎంపిక చేసుకునే డెట్‌ పేపర్లపైనే ఆధారపడి ఉంటుంది. ఫండ్‌ నిర్వహణ సంస్థ తక్కువ రిస్క్‌ ఉండే డెట్‌ పేపర్లనే అన్ని కాలాల్లోనూ ఎంపిక చేసుకుంటుందని నమ్మడానికి లేదు. అధిక రాబడుల కోసం నాణ్యతలేమి డెట్‌ పేపర్లలోనూ పెట్టుబడులు పెట్టొచ్చు.  
   
ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ అదే చేసింది. పరిమితికి మించి పెట్టుబడుల్లో రిస్క్‌ తీసుకుంది. సాధారణంగా ఏఏ అంతకంటే దిగువ రేటింగ్‌ పేపర్లలో క్రెడిట్‌ రిస్క్‌ ఉంటుంది. అంటే డిఫాల్ట్‌ రిస్క్‌ ఉంటుంది. అందుకే ఆయా డెట్‌ పేపర్లను జారీ చేసే సంస్థలు అధిక వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తుంటాయి. ఇన్వెస్టర్లకు అధిక రాబడులను ఆఫర్‌ చేసే ఉద్దేశంతో 2019 డిసెంబర్‌ నాటికి ఫ్రాంక్లిన్‌ ఇండియా లో డ్యూరేషన్‌ ఫండ్‌ 84 శాతం పెట్టుబడులను తీసుకెళ్లి ఏఏ, అంతకంటే తక్కువ రేటింగ్‌ పేపర్లలో పెట్టేసింది. అలాగే, షార్ట్‌ టర్మ్‌ ఇన్‌కమ్‌ ప్లాన్‌ పథకం కింద పెట్టుబడుల్లోనూ 80 శాతాన్ని అధిక రిస్క్‌ ఉండే పేపర్లలో ఇన్వెస్ట్‌ చేసింది. కానీ ఈ పథకాల పేర్లలో క్రెడిట్‌ రిస్క్‌ లేదన్నది గమనించాలి.

ఫ్రాంక్లిన్‌ ఇండియా క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్‌ 86 శాతం పెట్టుబడులను ఏఏ అంతకు దిగువ పేపర్లలో ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం. క్రెడిట్‌ రిస్క్‌ అని పేరులోనే ఉంది కనుక ఇలా ఇన్వెస్ట్‌ చేయడంలో అర్థం ఉంది. కానీ, లో డ్యూరేషన్, షార్ట్‌టర్మ్‌ ఇన్‌కమ్‌ ప్లాన్‌ విషయంలోనూ అదే విధంగా పెట్టుబడుల విధానాన్ని పాటించి తప్పు చేసింది. ఫ్రాంక్లిన్‌ ఇండియా డైనమిక్‌ అక్రూయల్‌ ఫండ్, ఇన్‌కమ్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌ సైతం అదే తోవలో నడిచాయి. సెబీ కేటగిరీ నిబంధనలను ఏ మాత్రం పాటించలేదన్న విషయం ఇక్కడ తేటతెల్లమవుతోంది. అందుకే ఇన్వెస్టర్లు పెట్టుబడుల కోసం డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలను ఎంపిక చేసుకునే ముందు కేవలం పేరు, విభాగానికే పరిమితం కావద్దు. వాటి పోర్ట్‌ఫోలియోను పూర్తిగా చూసి, నిబంధనల మేరకే ఉందని నిర్ధారించుకున్న తర్వా తే ఇన్వెస్ట్‌ చేయాలి. ఇప్పటికే మీరు డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉంటే.. ఆయా పథకాలను ఒక్కసారి సమగ్రంగా పరిశీలించుకోండి. తెలియకపోతే నిపుణుల సాయం పొందడానికి వెనుకాడొద్దు.

రాబడులే గీటురాయి కావద్దు..
పెట్టుబడికి రాబడి ఒక్కటే ప్రామాణికంగా భావించడం సరికాదు. రాబడితోపాటు పెట్టుబడికి రక్షణ కూడా అంతే ముఖ్యం. కానీ, చాలా మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు అధిక రాబడులను ఇచ్చే పథకాలనే ఎక్కువగా ఎంపిక చేసుకుంటుంటారు. అంత రాబడులను ఆయా పథకాలు ఎలా ఇవ్వగలుగుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఫ్రాంక్లిన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ అర్ధంతరంగా మూసేసిన డెట్‌ పథకాలు కూడా రాబడులతో ఇన్వెస్టర్లను ఆకర్షించినవి కావడం గమనార్హం. అనలిస్టులు, ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు సైతం ఫ్రాంక్లిన్‌ ఇండియా సంస్థ అంత రాబడులను ఎలా ఇవ్వగలుగుతోందన్న సంశయాన్ని ఎదుర్కొన్న వారే. ఆ రాబడుల వెనుకనున్న అసలు రూపం ఆలస్యంగానే బయటకు వచ్చింది. అధిక రాబడులను ఇచ్చే ఫ్రాంక్లిన్‌ డెట్‌ పథకాలను ఇన్వెస్టర్లకు సూచించిన ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా డెట్‌ పథకాలు రాబడులను ఎలా ఇస్తాయన్నది తెలియకపోతే వాటికి ఇన్వెస్టర్లు దూరంగా ఉండడమే మంచిదని నిపుణుల సూచన.  
   
పోటీ పథకాలతో పోలిస్తే అధిక రాబడులను ఇవ్వాలన్న లక్ష్యాన్ని ఫ్రాంక్లిన్‌ ఇండియా అనుసరించింది. అందుకోసం అసాధారణ విధానాలను ఎంచుకుంది. పెట్టుబడుల్లో సింహ భాగాన్ని ‘బీస్పోక్‌ బాండ్స్‌’.. అంటే ప్రైవేటుగా జారీ చేసే బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసింది. 2020 మార్చి నాటికి ఆరు డెట్‌ పథకాలకు సంబంధించి 56 శాతం నుంచి 77 శాతం పెట్టుబడులను ఫ్రాంక్లిన్‌ ఇండియా సంస్థ ఇటువంటి బాండ్లలోనే పెట్టింది. ప్రైవేటుగా జారీ చేసిన బాండ్లలో 70 శాతం పెట్టుబడులు ఈ సంస్థవే ఉన్నాయి.

బీస్పోక్‌ బాండ్లలో సింహ భాగం పెట్టుబడులు ఈ ఒక్క సంస్థే పెట్టడంతో అధిక వడ్డీ రేటును డిమాండ్‌ చేసి పొందగలిగింది. కానీ, ఆయా బాండ్లు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్నవి కావు. అంటే లిక్విడిటీ తగినంత లేనివి. బాండ్లను జారీ చేసిన సంస్థ సమస్యల్లో పడిపోవడంతో ఫ్రాంక్లిన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులను వెంటనే వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఎదురైంది. పైగా ఆయా బాండ్ల నుంచి కాల వ్యవధి తీరిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసేసుకోకుండా.. వాటిల్లోనే కొనసాగుతూ వడ్డీ రేట్లను సవరించుకుంటూ ముందుకు వెళ్లింది. దీనివల్ల వడ్డీ రేట్ల పరంగా ఎక్కువ ప్రతిఫలాన్ని రాబట్టే ప్రయత్నం చేసింది.  
   
ఇక్కడే మరో తప్పిదం కూడా జరిగింది. ఆయా బాండ్లలోనే కొనసాగే విధానం వల్ల.. షార్ట్‌టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌ పెట్టుబడులను దీర్ఘకాలం పాటు కొనసాగించే విధానాలను ఆశ్రయించింది. అంటే స్వల్పకాలం కోసం తీసుకున్న పెట్టుబడులను దీర్ఘకాల బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసింది. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఉదాహరణకు లో డ్యురేషన్‌ ఫండ్స్‌ అన్నవి 6 నెలల నుంచి 12 నెలలకు మించని కాల వ్యవధితో కూడిన డెట్, మనీ మార్కెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. అంటే

12 నెలలకు మించిన సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయవు. కానీ, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ సంస్థ లో డ్యూరేషన్‌ ఫండ్స్‌ పెట్టుబడులను బీస్పోక్‌ బాండ్లలోనే గడువు తీరినా కొనసాగిస్తూ వెళ్లింది. కేవలం అధిక రాబడుల కోసమే ఇలా చేసింది. వడ్డీ రేట్లను సవరించిన తేదీలనే పెట్టుబడుల కాల వ్యవధిగా చూపించింది. ఇలాంటి విధానాలతో అధిక రాబడులను ఇవ్వొచ్చేమో కానీ.. ఇన్వెస్టర్ల పెట్టుబడులను అధిక రిస్క్‌లో పెట్టినట్టే అవుతుంది. సెబీ నిబంధనల ప్రకారం మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు పోర్ట్‌ఫోలియో వివరాలను నెలవారీగా ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. కానీ, ఈ పోర్ట్‌ఫోలియోలో మ్యూచువల్‌ ఫండ్‌ పథకం కలిగి ఉన్న బాండ్ల వివరాలే ఉంటాయి. అంతకుమించి వివరాలు తెలియవు. దీంతో ఇక్కడే రిస్క్‌ ఏర్పడుతుంది. మన బాండ్‌ మార్కెట్‌ ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి కాలేదు. దీంతో చాలా బాండ్లు ప్రైవేటుగా అనధికారిక ఒప్పందాల మేరకు జారీ అవుతుంటాయి. అందుకే డెట్‌ ఫండ్స్‌ విషయానికొస్తే మీరు చూసేది వేరు.. పొందేది వేరన్నది గ్రహించాలి. పోర్ట్‌ఫోలియోలో డెట్‌ పేపర్లు, వాటి కాల వ్యవధి వివరాలు ఉంటాయి. వాటిని సమగ్రంగా పరిశీలించడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది.

నియంత్రణపరమైన లోపాలు
మ్యూచువల్‌ ఫండ్స్‌ మెరుగైన నియంత్రణల మధ్య నడుస్తుంటాయని, మంచి రాబడులను ఇస్తాయని అందరికీ తెలిసిన విషయం. అంటే నూరు శాతం రిస్క్‌ లేనివని భావించొద్దు. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థలు దివాలా తీసిన తర్వాత డెట్‌ ఫండ్స్‌ విషయంలో సెబీ నిబంధనలను కఠినతరం చేసిన మాట వాస్తవమే. సెబీ అన్ని చర్యలు తీసుకున్నాకానీ.. ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ రూపంలో మరోసారి లోపాలు బయటపడ్డాయి. అందుకే నియంత్రణ సంస్థలు, నిబంధనలపై భారం వేసి ఇన్వెస్టర్లు నిశ్చింతగా కూర్చుంటామంటే కుదరదు. ఎందుకంటే ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ ఆరు డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ మూసివేయడానికి ముందే.. ఆ సంస్థ సీనియర్‌ ఉద్యోగులు ఆయా పథకాల్లో తమకున్న పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నట్టు సెబీ గుర్తించింది.

ఇది ఇన్వెస్టర్లను పూర్తిగా వంచించడమే అవుతుంది. స్టాక్‌ ఎక్సే్చంజ్‌ల్లో లిస్టెడ్‌ కంపెనీలకు సంబంధించి కఠినమైన ఇన్‌సైడర్‌ నిబంధనలను సెబీ అమలు చేస్తోంది. స్టాక్‌ ఎక్సే్చంజ్‌ల స్థాయిలో నిఘా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఇవే నిబంధనలు మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లకు వర్తించవు. దీంతోఫండ్స్‌ సంస్థల్లో పనిచేసేవారు, వారి సన్నిహితులు ఆంత రంగిక సమాచారం ఆధారంగా యూనిట్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడే అవకాశం లేకపోలేదు. ఇన్వెస్టర్ల ఆమోదం లేకుండా ఏకపక్షంగా ఫ్రాంక్లిన్‌ వ్యవహరించింది. దీంతో సెబీ మ్యూచువల్‌ ఫండ్స్‌ నిబంధనల్లో లోపాలకు వెంటనే చెక్‌ పెట్టకపోతే.. ఇతర సంస్థల్లోనూ ఈ తరహా లోపాలకు ఆస్కారం లేకపోలేదు. అందుకే ఇన్వెస్టర్లు కాస్త అవగాహనతో వ్యవహరించడం ముఖ్యం.

స్టార్‌ను చూస్తేనే సరిపోదు..
స్టార్‌ ఫండ్‌ మేనేజర్‌.. మంచి రాబడుల చరిత్ర అన్నవి మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకం ఎంపిక విషయంలో ఇన్వెస్టర్లు చూసే అంశాలు. కానీ, ఇవి మాత్రమే చాలవని ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ ఉదంతం సూచిస్తోంది. ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ డెట్‌ పథకాలను పర్యవేక్షించిన ఫండ్‌మేనేజర్‌ సంతోష్‌ కామత్‌కు మంచి ట్రాక్‌ రికార్డే ఉంది. ఆయన పనితీరును చూసి రిస్క్‌కు భయపడే ఇన్వెస్టర్లకు ఫ్రాంక్లిన్‌ డెట్‌ పథకాలను ఆర్థిక సలహాదారులు  సూచించే వారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డెట్‌ పేపర్ల నాణ్యతలో, లిక్విడిటీ విషయంలో కామత్‌ రాజీపడ్డారు. అదే సంక్షోభానికి దారితీసింది. అందుకే స్టార్‌ రేటింగ్‌లకే పరిమితం కాకుండా కాస్త లోతుగా చూసిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి.

సుప్రీం జోక్యం వరకూ..
ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. ఫ్రాంక్లిన్‌ ఇండియా అల్ట్రా షార్ట్‌ బాండ్‌ ఫండ్, ఫ్రాంక్లిన్‌ ఇండియా లో డ్యురేషన్‌ ఫండ్, ఫ్రాంక్లిన్‌ ఇండియా షార్ట్‌టర్మ్‌ ఇన్‌కమ్‌ ఫండ్, ఫ్రాంక్లిన్‌ ఇండియా ఇన్‌కమ్‌ అపార్చునిటీస్‌ ఫండ్, ఫ్రాంక్లిన్‌ ఇండియా డైనమిక్‌ అక్రూయల్‌ ఫండ్, ఫ్రాంక్లిన్‌ ఇండియా క్రెడిట్‌రిస్క్‌ ఫండ్‌లను 2020 ఏప్రిల్‌లో నిలిపివేసింది. ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు అభ్యర్థనలు వస్తుండగా.. వాటికి చెల్లింపులు చేసే స్థాయిలో లిక్విడిటీ లేకపోవడం (అంటే పెట్టుబడులను విక్రయించాలనుకుంటే కొనేవారు లేక)తో ఈ నిర్ణయం తీసుకుంది.

ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ ఆసియా పసిఫిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ హెడ్‌ వివేక్‌ కుద్వా ఈ పథకాలను మూసివేయడానికి ముందే తన వ్యక్తిగత హోదాలో ఇన్వెస్ట్‌ చేసిన రూ.32 కోట్లను వెనక్కి తీసేసుకున్నట్టు సెబీ గుర్తించింది. ఇది ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌. అందుకే డెట్‌ ఫండ్స్‌ పథకాలకు సంబంధించి ఉండే గరిష్ట రిస్క్‌ స్థాయిలను ఇన్వెస్టర్లకు తెలియజేయాలంటూ సెబీ ఇటీవలే నిబంధనలను తీసుకొచ్చింది. ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ మూసేసిన ఆరు డెట్‌ పథకాల ఇన్వెస్టర్లకు జూన్‌ 15 నాటికి రూ.17,777 కోట్లు వెనక్కి రావడం కొంత ఊరట. 2020 ఏప్రిల్‌ 23 నాటికి ఆయా పథకాల్లోని మొత్తం పెట్టుబడుల్లో ఇది 71%. సుప్రీంకోర్టు జోక్యంతో ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ లిక్విడేటర్‌గా రంగంలో దిగడంవల్ల ఇన్వెస్టర్ల పెట్టుబడులు వారికి చేరడానికి మార్గం సుగమం అయ్యింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు