India GDP: భారత్‌ వృద్ధి అంచనాలు డౌన్‌..!

10 May, 2021 07:59 IST|Sakshi

 8.5 శాతానికి తగ్గించిన క్రెడిట్‌ సూసీ

ముంబై : కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి నేపథ్యంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను రేటింగ్‌ ఏజెన్సీ క్రెడిట్‌ సూసీ గణనీయంగా తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి 8.5–9 శాతానికి పరిమితం కాగలదని వెల్లడించింది. కోవిడ్‌ పరిణామాల ప్రతికూల ప్రభావం 100–150 బేసిస్‌ పాయింట్ల మేర ఉండొచ్చని పేర్కొంది. ఇక భారత్‌ తన సామర్థ్యానికి తగినట్లుగా పూర్తి స్థాయి వృద్ధి రేటును చేరుకోవాలంటే 2022–23 తర్వాత అదనంగా మరో రెండు మూడేళ్లు పట్టేయొచ్చని క్రెడిట్‌ సూసీ వెల్లడించింది.

తాము వృద్ధి అంచనాలను తగ్గించినప్పటికీ మిగతా ఏజెన్సీల లెక్కలతో పోలిస్తే కొంత ఎక్కువగానే ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ వృద్ధి 4 శాతంగా ఉండగా, 2021–22లో ఇది అంతకు మించి 5 శాతంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు క్రెడిట్‌ సూసీ ఇండియా ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌ నీలకంఠ మిశ్రా తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు గతేడాది నెలల తరబడి కొనసాగగా ఈసారి కొద్ది వారాలకు మాత్రమే పరిమితం కావచ్చని ఆయన పేర్కొన్నారు.

చదవండి: భారత్‌ ఎకానమీకి నష్టం తప్పదు!

>
మరిన్ని వార్తలు