ఐటీ కొలువుల మేళా: భారీగా టెకీల నియామ‌కం!

18 May, 2021 20:52 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐటీ ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది దేశంలో భారీగా నియామకాలు చేపట్టనున్నట్లు టిసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ వంటి దేశీయ దిగ్గజ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ఇప్పుడు ఆ జాబితాలో స్విట్జర్లాండ్ కు చెందిన క్రెడిట్ సూయిస్ వచ్చి చేరింది. అంత‌ర్జాతీయ బ్యాంక్ సేవ‌లకు టెక్నాల‌జీ కేంద్రంగా భారతదేశాన్ని నిలబెట్టడానికి క్రెడిట్ సూయిస్ చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో భాగంగా ఈ నియామ‌కాల‌ను చేపడుతున్నట్లు బ్యాంక్ తెలిపింది. ఐటీ నిపుణులకు డిమాండ్ నెల‌కొన్న నేప‌థ్యంలో ఈ ఏడాది ఇండియాలో వేయికి పైగా టెకీల నియామకానికి ప్ర‌ణాళిక‌లు రచించినట్లు స్విస్ బ్యాంక్ దిగ్గ‌జం క్రెడిట్ సూస్ వెల్ల‌డించింది.

సైబర్‌ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, క్లౌడ్, ఎపీఐ డెవలప్‌మెంట్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలకు సంబందించిన డెవలపర్లు, ఇంజనీర్లను ఎంచుకొనున్నట్లు తెలిపింది. గత మూడేళ్లలో 2 వేల మంది ఐటి ఉద్యోగులను బ్యాంక్ నియమించుకున్నట్లు పేర్కొంది. క్రెడిట్ సూయిస్ లక్ష్యం భారతదేశంలో అందుబాటులో ఉన్న నైపుణ్యం కలిగిన సాంకేతిక ప్రతిభావంతుల అంతర్గత సామర్థ్యాలను మరింత మెరుగుపరచడం అని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఐటి సిబ్బందిలో భారతీయులు ఇప్పుడు దాదాపు 25 శాతం వాటాను కలిగి ఉన్నారు. 

చదవండి:

ఈ పోటీలో గెలిస్తే రూ.50 వేలు మీ సొంతం?

మరిన్ని వార్తలు