ఇల్లు కొనాలనే కోరిక ఉంది.. కానీ నెరవేర్చుకోవడమే కష్టం..

11 May, 2022 11:04 IST|Sakshi

బలంగా హౌసింగ్‌ డిమాండ్‌

ముంబై: ధరలు పెరిగినా, రుణాలపై వడ్డీ రేట్లు సమీప కాలంలో పెరిగే అవకాశాలున్నా కానీ, ఇళ్లకు డిమాండ్‌ బలంగా ఉంటుందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. దేశంలోని టాప్‌ 6 నగరాల్లో ఇళ్ల డిమాండ్‌ 5–10% మేర పెరుగుతుందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2021–22 మొత్తం మీద ఇళ్ల డిమాండ్‌ 33–38% స్థాయిలో వృద్ధి చెంది ఉండొచ్చని అంచనా వేసింది. ఇది కరోనా ముందు నాటి స్థాయిలను అధిగమించినట్టేనని పేర్కొంది. 2020–21లో తక్కువ బేస్‌ (కనిష్ట స్థాయి) కారణంగా అధిక వృద్ధి నమోదైనట్టు పేర్కొంది. మూలధన వ్యయాలు అధికంగా ఉండడం, వడ్డీ రేట్లు, స్టాంప్‌ డ్యూటీని తిరిగి ప్రవేశపెట్టడం ఈ రంగానికి అవరోధాలుగా క్రిసిల్‌  తెలిపింది. 

నివాస గృహాల ధరలు పెరుగుతాయి..  
‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు ప్రధాన పట్టణాల్లో నివాస గృహాల ధరలు 6–10% స్థాయిలో పెరుగుతాయన్నది మా అంచనా. ఎందుకంటే మెటీరియల్స్‌ ధరలు గణనీయంగా పెరిగాయి. దీనికితోడు డిమాండ్‌–సరఫరా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి’’అని క్రిసిల్‌ డైరెక్టర్‌ అనికేత్‌ దాని తెలిపారు. కరోనా ముందు డెవలపర్ల వద్ద ఇన్వెంటరీ (అమ్మకానికి సిద్ధంగా ఉన్న యూనిట్లు) 3–3.5%గా ఉంటే.. 6 ప్రధాన పట్టణాల్లో తాజాగా ఇది 2–4% స్థాయిలో ఉన్నట్టు క్రిసిల్‌ నివేదిక వెల్లడించింది. పెద్ద రియల్టీ డెవలపర్లు మార్కెట్‌ వాటాను పెంచుకుంటున్నారని.. 2022 మార్చి నాటికి వీరి వాటా 24–25%కి చేరిందని తెలిపింది.

ఇబ్బందే..
ఇప్పటికే ఆర్బీఐ రెపోరేటు పెంచడంతో బ్యాంకులు హోంలోన్లపై వడ్డీలు పెంచాయి. అంతకు ముందే మెటీరియల్‌ కాస్ట్‌ పెరగడంతో ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకున్నాయి. దీంతో ఇళ్లు కొనాలనే ఆసక్తి ఉన్నా.. ద్రవ్యోల్బణ పరిస్థుల్లో సొంతింటి కల నెరవేర్చుకోవడం కష్టంగా మారుతోంది.

చదవండి: 5 శాతం పెరిగిన రేట్లు.. హైదరాబాద్‌లో తగ్గని రియల్టీ జోరు

మరిన్ని వార్తలు