CRISIL: రూ.71.4 లక్షల కోట్లకు రాష్ట్రాల రుణ భారం

29 Sep, 2021 10:47 IST|Sakshi

ముంబై: రాష్ట్రాల రుణ భారం 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.71.4 లక్షల కోట్లకు చేరుతుందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో చూస్తే వాటి రుణ భారం 2021–22లో 33 శాతంగా ఉంటుందని పేర్కొన్న క్రిసిల్, 2020–21 ఆర్థిక సంవత్సరంతో (34 శాతం) పోల్చితే దాదాపు సమానమేనని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు పెరగడం, వ్యయాలు ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే అంశంగా పేర్కొంది. నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే...
 
2020–21తో పోల్చితే 2021–22లో రాష్ట్రాల మొత్తం రుణం రూ.7.2 లక్షల కోట్లు పెరుగుతుంది. తద్వారా ఈ మొత్తం రూ.71.4 లక్షల కోట్లకు చేరుతుంది. అయితే ఆదాయాలు 15 శాతం పెరిగి, మూడవ వేవ్‌ రాకుండా ఉంటేనే ఈ లెక్కల అంచనా నిజమవుతుంది. లేదంటే రుణ భారాలు మరింత పెరగక తప్పదు.  

 మొత్తం జీఎస్‌డీపీలో దాదాపు 90 శాతం వాటా కలిగిన 18 రాష్ట్రాలను పరిశీలనలోకి తీసుకుంటే, ఆయా రాష్ట్రాలకు జీఎస్‌టీ పరిమాణం 0.9 లక్షల కోట్ల నుంచి (గత ఏడాది) రూ.1.4 లక్షల కోట్లకు పెరగడం ఊరటనిచ్చే అంశం.  

 2019–20లో రాష్ట్రాల ఆదాయ లోటు రూ.1.8 లక్షల కోట్లు. కరోనా కష్ట కాలం 2020–21లో ఇది రూ.3.8 లక్షల కోట్లకు పెరిగింది. 2021–22లో రూ.3.4 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉంది. ఇదే కాలంలో రాష్ట్రాల మూలధన వ్యయాలు జీఎస్‌డీపీలో వరుసగా 3.7 శాతం, 3.6 శాతంగా ఉంటే, 2021–22లో 4.4 శాతంగా ఉండే వీలుంది.  

► 2019–20లో స్థూల ద్రవ్యలోటు 5.1 శాతం. 2020–21లో ఇది 7.6 శాతానికి చేరింది. 2021–22లో ఇది మరింతగా 8.2 శాతానికి పెరిగే వీలుంది. 

► ఒక్క రెవెన్యూ లోటును తీసుకుంటే, 2020– 21లో రూ.3.8 లక్షల కోట్లయితే (జీఎస్‌డీపీలో 2 శాతం), 2021–22లో రూ.3.4 లక్షల కోట్లకు (జీఎస్‌డీపీలో 1.6 శాతం) తగ్గే వీలుంది.  

 తొలి రెండు ఆర్థిక సంవత్సరాల్లో రుణ భారాలు వరుసగా 55.7 లక్షల కోట్లు, రూ.64.2 లక్షల కోట్లుగా ఉంటే, 2021–22లో రూ.71.4 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది.  

► గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రాల ఆదాయాలు 3 శాతం పతనమైతే, 2021–22లో 15 శాతం పెరుగుతాయని భావిస్తున్నాం.  

► ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న నేపథ్యంలో, మొత్తం పన్ను వసూళ్లలో ఆదాయంలో రెండు ప్రధాన భాగాలు– వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అలాగే పెట్రోలియం ఉత్పత్తులు– మద్యం మీద అమ్మకపు పన్ను వాటా 30 శాతంగా ఉంటుంది. ఈ విభాగాల నుంచి ఆదాయాలు పటిష్టంగా ఉండే వీలుంది.  అధిక ద్రవ్యోల్బణం,  బేస్‌ పెంపు ద్వారా జీఎస్‌టీ 20 శాతం వృద్ధి చెందే వీలుంది.   

► అయితే పన్నులు పెరిగినప్పటికీ ఆదాయ వ్యయాలు 10 నుంచి 11 శాతం పెరగవచ్చు. రాష్ట్రాల ఆదాయ వ్యయాల్లో 75 నుంచి 80 శాతం వేతనాలు, పెన్షన్లు, వడ్డీ వ్యయాలు, గ్రాంట్‌–ఇన్‌–ఎయిడ్, వైద్యం, కార్మిక సంక్షేమం వంటి కార్యక్రమాలకే కేటాయించాల్సిన పరిస్థితి ఉంది.  

► రోడ్లు, సాగునీరు, గ్రామీణాభివృద్ధి వంటి మౌలిక రంగాలకు రుణ సమీకరణలు జరపాల్సిన పరిస్థితి ఉంది.  

► ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయంలో రాష్ట్రాలు 55 శాతం వృద్ధిని (రూ .5.6 లక్షల కోట్లు) అంచనావేస్తూ బడ్జెట్‌ ప్రకటించాయి. కానీ వృద్ధి 20 శాతం దాటబోదన్నది అంచనా. ఇప్పటికే 4 శాతంగా ఉన్న ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య ఉన్న నికర వ్యత్యాసం) దీనికి ప్రధాన కారణం.  

పెరుగుతున్న రాష్ట్రాల రుణ వ్యయాలు: కేర్‌ రేటింగ్స్‌ 
ఇదిలావుండగా, రాష్ట్రాల రుణ వ్యయాలు పెరుగుతున్నాయని కేర్‌ రేటింగ్స్‌ మరో నివేదికలో పేర్కొంది. గడచిన ఐదు వారాలుగా రాష్ట్రాల మార్కెట్‌ రుణాలు దీనికి కారణమని వివరించింది. అన్ని మెచ్యూరిటీలపై సగటున వ్యయాలు 5 బేసిస్‌ పాయింట్లు పెరిగి 6.85 శాతానికి చేరినట్లు కేర్‌ రేటింగ్స్‌ పేర్కొంది.

చదవండి: షాకింగ్‌ సర్వే,దక్షిణాది కుటుంబాలలో అప్పులే అధికం

మరిన్ని వార్తలు