ఎకానమీ వృద్ధి అంచనాలకు క్రిసిల్‌ కోత 

2 Jul, 2022 12:05 IST|Sakshi

2022-23లో 7.8 శాతం నుంచి 7.3 శాతానికి డౌన్‌

తీవ్ర క్రూడ్‌ ధరలు, ద్రవ్యోల్బణం, డిమాండ్‌ మందగమనం కారణం  

సాక్షి, ముంబై: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక  సంవత్సరం (2022–23) వృద్ధి అంచనాలను దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ శుక్రవారం 7.3 శాతానికి తగ్గించింది. ఇంతక్రితం ఈ అంచనా 7.8 శాతం. అధిక చమురు ధరలు, ద్రవ్యోల్బణం ఎగుమతుల డిమాండ్‌ మందగమనం తన తాజా నిర్ణయానికి కారణమని తెలిపింది.
ఈ మేరకు క్రిసిల్‌ విడుదల చేసిన నివేదికలో కొన్నిముఖ్యాంశాలు.. 
♦ అధిక కమోడిటీ, సరకు ధరలు, ప్రపంచ వృద్ధి అంచనాలు తగ్గుముఖం పట్టడంతో ఎగుమతులకు డిమాండ్‌ తగ్గే పరిస్థితి నెలకొంది. ప్రైవేట్‌ వినియోగంకు దోహదపడే అంశాలు కూడా బలహీనంగా ఉండటం తీవ్ర ప్రతికూలాంశం.  
♦ కాంటాక్ట్‌-ఇంటెన్సివ్‌ సేవల్లో పెరుగుదల, సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు ప్రస్తుతం ఎకానమీకి ఉన్న బలాలు.  
♦ ద్రవ్యోల్బణం 2021-22 ఆర్థిక  సంవత్సరంలో  5.5 శాతం ఉంటే, 2022–23లో సగటున 6.8 శాతంగా ఉంటుందని అంచనా. ఇది కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. వినియోగం పునరుద్ధరణపై ప్రభావం చూపుతుంది. స్థూల దేశీయోత్పత్తిలో కొనుగోలు, వినియోగ రంగాలపాత్ర కీలకం.  
♦ అధిక కమోడిటీ ధరలు, గ్లోబల్‌ వృద్ధి మందగించడం, సరఫరా చైన్‌లో సవాళ్లు భారత్‌ కరెంట్‌ ఖాతాపై (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) ప్రభావం చూపుతుంది.  కరెంట్‌ ఖాతా లోటు 2021-22లో (జీడీపీ) 1.2 శాతం ఉంటే, 2022-23లో 3 శాతానికి పెరిగే అవకాశం ఉంది.   
♦ఆర్థిక బలహీనతల నేపథ్యంలో 2023 మార్చి నాటికి అమెరికా డాలర్‌లో రూపాయి విలువ మరింత బలహీనపడే అవకాశం ఉంది. పెరుగుతున్న వాణిజ్య లోటు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) ప్రవాహాలు భారీగా వెనక్కు మళ్లడం, అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ బలోపేతం (రిజర్వ్‌ రేట్ల పెంపుదల కారణంగా) రూపాయి-డాలర్‌ మారకపు విలువ సమీప కాలంలో తీవ్ర ఒడిదుడుకులకు, దిగువముఖ పయనానికి దారితీసే వీలుంది.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో డాలర్‌ను ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సురక్షిత సాధనంగా ఎంచుకోవచ్చు.  
♦2022-23 ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్‌ క్రూడ్‌ సగటు బ్యారెల్‌కు 105-110 డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. ఇది గత ఆర్థిక  సంవత్సరంతో పోలిస్తే 35 శాతం ఎక్కువ. 2013 తర్వాత క్రూడ్‌ ఈ స్థాయిలో ఎప్పుడూ లేకపోవడం గమనార్హం.  
♦ అధిక కమోడిటీ ధరలు భారత్‌ ఎకానమీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. పెరుగుతున్న దిగుమతి బిల్లుతో వాణిజ్య లోటు తీవ్రం అయ్యే వీలుంది. దిగుమతుల బిల్లు పెరగడం ద్ర వ్యోల్బణం పెరుగుదలకూ కారణం అవుతుంది.  
♦ ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను మరో 75 బేసిస్‌ పాయింట్లకు పెంచే వీలుంది. మే, జూన్‌ నెలల్లో రెపో రేటును 90 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 4.9 శాతానికి ఎగసింది. వడ్డీరేట్ల పెరుగుదల వృద్ధి అవకాశాలను దెబ్బతీసే అంశం. రియల్టీ మహమ్మారి స్థాయికన్నా కిందకు పడిపోయే వీలుంది. ద్రవ్యోల్బణం కట్టడికి ద్రవ్య పరపతి విధానాలు మరికొంతకాలం కఠినంగా కొనసాగే అవకాశం ఉంది.  

2022-23పై అంచనాల కోతలు (శాతాల్లో) ఇలా... 

సంస్థ తాజా తొలి 
ఆర్‌బీఐ 7.2  7.8
ఎస్‌అండ్‌పీ 7.3 7.8
ఫిచ్‌  8.5 10.3 
ప్రపంచ బ్యాంక్‌ 7.5  8.0 
ఐఎంఎఫ్‌ 8.2  9
ఏడీబీ   7.5  ––

♦ మూడీస్‌ గత ఏడాది నవంబర్‌లో 2022–23లో భారత్‌ వృద్ధి 9.3 శాతం ఉంటుందని అంచనావేసింది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ అంచనా తగ్గించే అవకాశం ఉంది. అయితే 2022 క్యాలెండర్‌ ఇయర్‌లో వృద్ధి రేటు అంచనాలను మూడీస్‌ 9.1 శాతం నుంచి 8.8 శాతానికి కోత పెట్టింది.   

మరిన్ని వార్తలు