షాపింగ్‌ మాల్స్‌కు ‌కరోనా సెకండ్‌ వేవ్‌ షాక్‌!

15 Apr, 2021 08:23 IST|Sakshi

షాపింగ్‌  మాల్స్‌ ఆదాయంపై  క్రిసిల్‌ అంచనా 

 కరోనా ముందు కంటే తక్కువ స్థాయికి  

సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి కారణంగా గతేడాది దేశంలో షాపింగ్‌ మాల్స్‌ ఆదాయం 45 శాతం క్షీణించిందని.. 2022 ఆర్ధిక సంవత్సరంలో మాత్రం 45-55 శాతం మేర పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. అయినా సరే కరోనా కంటే ముందుతో పోలిస్తే ఈ వృద్ధి 80–85 శాతానికే చేరుతుందని తెలిపింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో షాపింగ్‌ మాల్స్‌లో ఆరోగ్యకరమైన వృద్ధి ఉన్నప్పటికీ.. మాల్స్‌ ఆదాయం మాత్రం కోవిడ్‌-19 కంటే ముందు స్థాయికి చేరుకోలేదని పేర్కొంది. (జోరందుకున్న కార్మికుల నియామకం)

కరోనా సెకండ్‌ వేవ్‌ ఆంక్షలు షాపింగ్‌ మాల్స్‌లో రిటైల్‌ అమ్మకాల మీద మాత్రమే ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని, బలమైన స్పాన్సర్లు, ఆరోగ్యకరమైన లిక్విడిలీ ప్రొవైల్స్‌ కారణంగా మాల్స్‌ రుణ సేవా సామరŠాధ్యలు ప్రభావితం కావని తెలిపింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రిటైల్‌ అమ్మకాలు క్రమంగా కోలుకుంటాయని సీనియర్‌ డైరెక్టర్‌ అనుజ్‌ సేథీ చెప్పారు. ఈ అమ్మకాలు ప్రీ-కోవిడ్‌లో 90 శాతానికి చేరువవుతాయని ఇది అద్దె మాఫీకి హామీ ఇవ్వకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో షాపింగ్‌ మాల్‌ యజమానుల అద్దె ఆదాయం మీద ప్రభావాన్ని తగ్గిస్తుందని చెప్పారు. (ఈ–కామర్స్‌కు కరోనా జోష్‌..!)

రిటైల్‌ అమ్మకాల రికవరీ ఏకరీతిన ఉండదు. 14 రేటింగ్‌ ఉన్న మాల్స్‌లో మరీ ముఖ్యంగా దేశంలోని మాల్స్‌ మొత్తం ఆదాయంలో 35-40 శాతం వాటా ఉన్న మహారాష్ట్రలో ప్రస్తుత మినీ లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కువగా ప్రభావితం అవుతాయని తెలిపింది. 2021 ఆర్ధిక సంవత్సరంలో మాల్స్‌లోని మొత్తం రిటైల్‌ విక్రయాలు 55శాతం మేర క్షీణించాయని.. మొదటి అర్ధ భాగంలో మాల్స్‌ మూసివేతలు గణనీయంగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. ప్రీ-పాండమిక్‌తో పోల్చితే మాల్స్‌లో ఫుట్‌ఫాల్స్‌ తక్కువగా ఉన్నప్పటికీ.. ఫుట్‌ఫాల్స్‌ సగటు వ్యయం మాత్రం 25 శాతానికి పైగా పెరిగిందని పేర్కొంది. కోవిడ్‌ ముందుతో పోల్చితే గత ఆర్ధిక సంవత్సరంలో దుస్తులు, సౌందర్య సాధనాలు, ఎలక్ట్రానిక్స్, లగ్జరీ, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ విభాగాలు 70 శాతం వరకు కోలుకున్నాయని.. సినిమా, కుటుంబ వినోద కేంద్రాలు మాత్రం క్షీణ దశలోనే ఉన్నాయని తెలిపింది. మాల్స్‌ మొత్తం ఆదాయంలో సినిమా అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆదాయం 10 శాతం వరకుంటుందని క్రిసిల్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు