రూ. 22 వేల కోట్లకు డీటీహెచ్‌ ఆదాయాలు 

12 Sep, 2020 07:46 IST|Sakshi

2020–21పై క్రిసిల్‌ నివేదిక 

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ పరిణామాల కారణంగా ప్రజలు ఇంటిపట్టునే ఉంటుండటం డీటీహెచ్‌ సంస్థలకు లాభించనుంది. టీవీ ప్రసారాల వీక్షణ గణనీయంగా పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డైరెక్ట్‌–టు–హోమ్‌ బ్రాడ్‌కాస్టర్ల ఆదాయం 6 శాతం మేర వృద్ధి చెంది రూ. 22,000 కోట్లకు చేరనుంది. రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. అయితే, ఆదాయం పెరిగినప్పటికీ వృద్ధి రేటు మాత్రం గత ఆర్థిక సంవత్సరం స్థాయిలో ఉండకపోవచ్చని పేర్కొంది. దేశీయంగా మొత్తం టీవీ సబ్‌స్క్రయిబర్స్‌లో డీటీహెచ్‌ వాటా 37 శాతం దాకా ఉంటుంది.  2020 ఆర్థిక సంవత్సరంలో 14 శాతం వృద్ధి నమోదైంది. (ఐటీ ఆదాయ వృద్ధిపై కరోనా పడగ)

ఇందులో 9 శాతం వాటా.. యూజర్ల సంఖ్య పెరగడం ద్వారా రాగా, ప్రతి యూజరుపై సగటు ఆదాయాలు (ఏఆర్‌పీయూ) పెరగడం వల్ల మరో 5 శాతం వచ్చిందని క్రిసిల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ సచిన్‌ గుప్తా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో యూజర్ల సంఖ్య మరో 6–7 శాతం పెరిగి 6.8 కోట్లకు చేరవచ్చని, తద్వారా ఆదాయ 4–6 శాతం మేర వృద్ధి చెందవచ్చని పేర్కొన్నారు. కానీ, బహుళ టీవీలున్న యూజర్లకు చార్జీలు తగ్గించడం తదితర అంశాల కారణంగా ఏఆర్‌పీయూ మాత్రం 1–2 శాతం మేర క్షీణించి రూ. 310–315 స్థాయికి రావచ్చని తెలిపారు.  (రైలు ప్రయాణికులూ...ఇవి పాటించాలి..)

దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ రైట్స్‌ ఇష్యూ: రూ.133 
న్యూఢిల్లీ: దీపక్‌ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ పెట్రోకెమికల్స్‌ కార్పొరేషన్‌ రైట్స్‌ ఇష్యూ ధరను ఒక్కో షేరుకు రూ.133గా ఖరారు చేసింది. రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.180 కోట్ల సమీకరణకు కంపెనీ ఈ ఏడాది మే నెలలో నిర్ణయం తీసుకున్న విషయం గమనార్హం. ఇందుకు సంబంధించి నిబంధనలకు బోర్డు ఆమోదం తెలిపిందని, రూ.10 ముఖ విలువ కలిగిన షేరు రైట్స్‌ ఇష్యూ ధరగా రూ.133ను నిర్ణయించినట్టు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. రికార్డు తేదీగా సెప్టెంబర్‌17ను ఖరారు చేసింది. ఆ తేదీ నాటికి కంపెనీ వాటాలను కలిగిన వారు రైట్స్‌ ఇష్యూకు అర్హులవుతారు. ప్రతీ 20 షేర్లకు మూడు షేర్ల చొప్పున దరఖాస్తు చేసుకోవచ్చు.

>
మరిన్ని వార్తలు