క్రాంప్టన్‌లో బటర్‌ఫ్లై విలీనం

27 Mar, 2023 00:55 IST|Sakshi

22:5 నిష్పత్తిలో షేర్ల మార్పిడికి ఓకే

బటర్‌ఫ్లై వాటాదారులకు క్రాంప్టన్‌ షేర్లు

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ ఎలక్ట్రికల్స్‌లో కిచెన్, స్మాల్‌ అప్లయెన్సెస్‌ కంపెనీ బటర్‌ఫ్లై గంధిమతి విలీనం కానుంది. ఏకీకృతం కావడం ద్వారా సంయుక్త సంస్థ పలు అంశాలలో వ్యాపార లబ్దిని పొందనుంది. దీంతో రెండు కంపెనీల కార్పొరేట్, పాలన తదితర అంశాలు సైతం సరళతరంకానున్నాయి. షేర్ల మార్పిడి ద్వారా విలీనంకానున్నట్లు రెండు సంస్థలూ విడిగా తెలియజేశాయి. ఇందుకు 22:5 నిష్పత్తిలో షేర్ల మార్పిడికి తెరతీయనున్నాయి. అంటే బటర్‌ఫ్లై వాటాదారులకు తమవద్దగల ప్రతీ 5 షేర్లకుగాను 22 క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ షేర్లను జారీ చేస్తారు. కాగా.. విలీనానికి సెబీ, స్టాక్‌ ఎక్సే్ఛంజీలుసహా పలు నియంత్రణ సంస్థల అనుమతిని పొందవలసి ఉంది. రుణదాతలు, ఎన్‌సీఎల్‌    టీ, వాటాదారులు సైతం ఆమోదముద్ర వేయవలసి ఉంది.  

కొత్త ప్రొడక్టులపై దృష్టి
బటర్‌ఫ్లైతో విలీనం ద్వారా కొత్త ప్రొడక్టుల తయారీపై మరింత దృష్టి పెట్టేందుకు వీలుచిక్కనున్నట్లు క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ ఎండీ శంతను ఖోస్లా పేర్కొన్నారు. విలీనం వాటాదారులకు మరింత విలువను చేకూర్చుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌తో విలీనం ద్వారా కంపెనీ కంపెనీ దేశవ్యాప్తంగా విస్తరించగలదని బటర్‌ఫ్లై ఎండీ రంగరాజన్‌ శ్రీరామ్‌ పేర్కొన్నారు. ఇది వృద్ధికి, ప్రొడక్టుల అభివృద్ధికి భారీ అవకాశాలకు తెరతీస్తుందని అభిప్రాయపడ్డారు. బటర్‌ఫ్లై గంధిమతిలో 81 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 2,076 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది.

మరిన్ని వార్తలు