సామాన్యుడికి మళ్లీ షాక్‌ ! ముంచుకొస్తున్న ధరల భారం.. కారణాలు ఇవే

15 Feb, 2022 08:21 IST|Sakshi

జనవరి రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.01 శాతం

టోకు ద్రవ్యోల్బణం 12.96 శాతం

తగ్గుతుందని ఆర్‌బీఐ గవర్నర్‌ భరోసా

ద్రవ్యోల్బణం కట్టడి, ఎకానమీ వృద్ధి సమతుల్యతే లక్ష్యమని ఉద్ఘాటన 

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థపై ధరల పెరుగుదల భారం తగ్గుతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ భరోసా ఇచ్చారు. ద్రవ్యోల్బణం కట్టడి–ఎకానమీ పురోగతి లక్ష్యంగా సెంట్రల్‌ బ్యాంక్‌ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అంతక్రితం ఆర్‌బీఐ బోర్డును ఉద్దేశించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రసంగించారు. బడ్జెట్‌ లక్ష్యాలను వివరించారు. వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఆర్‌బీఐ బోరŠుడ్డను ఉద్దేశించి ఆర్థికమంత్రి ప్రసంగించడం సాంప్రదాయకంగా వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు జనవరి నెలకు సంబంధించి సోమవారం వెలువడిన రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం జనవరిలో 6.01 శాతం కాగా టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రెండంకెలపైన 12.96 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి ధరల స్పీడ్‌)  నమోదయ్యింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 6–2 శ్రేణిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. ఈ స్థాయిని దాటి జనవరి గణాంకాలు నమోదుకావడం గమనార్హం.  

మా అంచనాలు బలమైనవే.. కానీ: శక్తికాంతదాస్‌ 
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ బోర్డ్‌ను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మీడియాతో మాట్లాడుతూ, ద్రవ్యోల్బణం దిగువముఖంగా పయనిస్తోందని అన్నారు. తమ అంచనాలు ‘‘బలమైనవే’’,  కానీ ప్రపంచ ముడిచమురు ధరల కదలికతో ముడిపడి ఉన్న ప్రతికూలతలు, సంబంధిత సమస్యలపై ఇవి ఆధారపడి ఉన్నాయని అన్నారు. ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల ప్రాతిపదికన, ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్‌బీఐ ఒక నిర్దిష్ట శ్రేణిని ఇప్పటి వరకూ  పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు. అయితే ఈ అంచనాలు అన్నీ చివరకు క్రూడ్‌ ధరలు, సంబంధిత ప్రతికూల అంశాలపై ఆధారపడి ఉంటాయని వివరించారు. ‘‘మా ద్రవ్యోల్బణం అంచనాలు చాలా పటిష్టంగా ఉన్నాయని నేను ఇప్పటికీ చెబుతాను. మేము దానికి కట్టుబడి ఉన్నాము. పూర్తిగా ఊహించనిది ఏదైనా జరిగితే పరిస్థితి భిన్నంగా ఉంటుందని మీకూ తెలుసు. ఇది ఎవ్వరూ ముందుగా ఊహించిలేని ఆకస్మిక స్థితి. ప్రస్తుతం ప్రతికూలాంశం ముడిచమురు ధరలే అని మీకు తెలుసు’’ అని గవర్నర్‌ తెలిపారు. ధరల స్థిరత్వం అంటే ప్రాథమికంగా ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని కొనసాగించడమేనని పేర్కొన్నారు. దీనికి కట్టుబడి ఉండాలన్నదే తమ సంకల్పని పేర్కొన్నారు. వృద్ధి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ద్రవ్యోల్బణం పట్ల తన  నిబద్ధత ఎలా ఉండాలన్నది రిజర్వ్‌ బ్యాంక్‌కు పూర్తిగా తెలుసునని దాస్‌ ఉద్ఘాటించారు. 

లోబేస్‌ ఎఫెక్ట్‌
‘‘ద్రవ్యోల్బణం ధోరణిని పరిశీలిస్తే, 2020 అక్టోబర్‌ నుంచి 2021 అక్టోబర్‌ వరకూ ఈ రేటు దిగువముఖంగానే పయనించింది. అయితే మూడవ త్రైమాసికంలో (అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌) ఇది తీవ్రంగా కనబడుతోంది. దీనికి లోబేస్‌ ఎఫెక్ట్‌ కారణం. రానున్న నెలల్లో కూడా ఈ లోబేస్‌ ఎఫెక్ట్‌ గణాంకాలపై విభిన్న రీతుల్లో కనబడుతుంది‘‘ అని గవర్నర్‌ వివరించారు.  ‘పోల్చుతున్న నెలలో’  అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో  ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్‌ ఎఫెక్ట్‌. కాగా,  స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021–22లో 9.2 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గుతుందని ఆర్‌బీఐ ఇటీవలి పాలసీ సమావేశం అంచనావేసింది. 


 
వచ్చే నెలలో గ్రీన్‌ బాండ్లు 
సావరిన్‌ గ్రీన్‌ బాండ్స్‌ జారీపై వచ్చే నెల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తెలిపారు. రూ.11.6 లక్షల కోట్లు మార్కెట్‌ రుణ సమీకరణలో భాగంగా కేంద్రం మొట్టమొదటిసారి 2022–23 వార్షిక బడ్జెట్లో ‘సావరిన్‌ గ్రీన్‌ బాండ్ల’ జారీ ప్రతిపాదన చేసింది. ఈ బాండ్ల ద్వారా సమీకరించే నిధులను పర్యావరణ సానుకూల ప్రభుత్వ మౌలిక ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు వినియోగించుకోవాలన్నది కేంద్రం లక్ష్యంమని బడ్జెట్‌ పేర్కొంది.

ఏడు నెలల గరిష్టానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం 
జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఆర్‌బీఐ రెపో రేటు నిర్ణయానికి (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం. దాదాపు 18 నెలల నుంచి ఇది ఇదే స్థాయిలో కొనసాగుతోంది) ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ (సీపీఐ) ద్రవ్యోల్బణం జనవరిలో ఏకంగా 6.01 శాతంగా (2021 ఇదే నెల ధరలతో పోల్చి) నమోదయ్యింది. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 2–6 శాతం శ్రేణి ఎగువ పరిమితికన్నా ఇది ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. గడచిన ఏడు నెలల్లో ఈ స్థాయి రిటైల్‌ ద్రవ్యోల్బణం (2021 జూన్‌లో 6.26 శాతం) నమోదుకావడం ఇదే తొలిసారి. 2021 జనవరిలో 4.06 శాతం. రిటైల్‌ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్‌బీఐ ఈ నెల మొదట్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా అంచనావేసింది. ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం  ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వంలోని పరపతి విధాన కమిటీ మెజారిటీ (6:5) అభిప్రాయపడింది.  

ధరల స్పీడ్‌ ఇలా... 
- తాజా సమీక్షా నెల్లో ఒక్క ఫుడ్‌ బాస్కెట్‌ చూస్తే ద్రవ్యోల్బణం 5.43 శాతం. 2021 డిసెంబర్‌లో ఈ రేటు 4.05 శాతం.  
- కూరగాయల ధరలు 2021 డిసెంబర్‌లో అసలు పెరక్కపోగా 2.99 శాతం క్షీణించాయి. అయితే 2022 జనవరిలో ఏకంగా 5.19 శాతం పెరిగాయి.  
- ఆయిల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ధరల పెరుగుదల తీవ్రంగా 18.7 శాతంగా ఉంది. 
- తృణ ధాన్యాలు, ఉత్పత్తుల ధరల పెరుగుదల డిసెంబర్‌లో 2.62 శాతం ఉంటే, జనవరిలో 3.39 శాతానికి ఎగశాయి.  
- మాంసం చేపలు ధరలు ఇదే కాలంలో 4.58 శాతం నుంచి 5.47 శాతానికి చేరాయి.  
- ఇంధనం–లైట్‌ విభాగంలో ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 10.95 శాతం ఉంటే, జనవరిలో 9.32 శాతానికి తగ్గింది. 
- దుస్తులు, పాదరక్షలు, రవాణా, కమ్యూనికేషన్లసహా వివిధ ఇతర విభాగాల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 9 శాతంపైన నమోదయ్యింది.  
- కాగా, డిసెంబర్‌ 2021 ద్రవ్యోల్బణాన్ని కూడా 5.59 శాతం నుంచి ఎగువముఖంగా 5.66 శాతంగా గణాంకాల కార్యాలయం సవరించింది.   

టోకు ధరలు.. రెండంకెలపైనే.. 
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2021 డిసెంబర్‌లో 13.56 శాతం ఉంటే, 2022 జనవరిలో 12.96 శాతానికి తగ్గింది (2021 జనవరి నెల టోకు ధరలతో పోల్చి). టోకు ద్రవ్యోల్బణం రెండంకెల పైన కొనసాగుతుండడం ఒక ఆందోళనకరమైన అంశంకాగా, ఆహార ఉత్పత్తుల ధరలు తీవ్ర స్థాయిలోనే కొనసాగుతుండడం గమనించదగిన మరో ప్రతికూల అంశం. గడచిన పది నెలల నుంచీ అంటే 2021 ఏప్రిల్‌ నుంచి టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైనే కొనసాగుతోంది. 2021 జనవరిలో ఈ రేటు 2.51 శాతం. అప్పటిలో బేస్‌ తాజా ధరలు తీవ్ర స్థాయిలో కనబడ్డానికి కారణమని గణాంకాలు సూచిస్తున్నాయి.  
కొన్ని కీలక విభాగాలు చూస్తే.. 
- ఫుడ్‌ ఆర్టికల్స్‌ విభాగంలో ధరలు 2021 డిసెంబర్లో 9.56 శాతం పెరిగితే, 2022 జనవరిలో (సమీక్షా నెల) 10.33 శాతానికి ఎగశాయి. ఇందులో ఒక్క కూరగాయలను ధరల స్పీడ్‌ భారగా 31.56 శాతం నుంచి 38.45 శాతానికి చేరింది.  
- ఫుడ్‌ ఆర్టికల్స్‌లో పప్పు దినుసులు, తృణ ధాన్యాలు, ధాన్యం నెలవారీగా పెరిగాయి. గుడ్లు, మాసం, చేపల ధరలు 9.85 శాతం ఎగశాయి. ఆలూ, ఉల్లి ధరలు మాత్రం 14.45 శాతం, 15.98 శాతం చొప్పున క్షీణించాయి.  
- మినరల్‌ ఆయిల్స్, క్రూడ్‌ పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్, బేసిక్‌ మెటల్స్, రసాయనాలు, రసాయన ఉత్పత్తులు ధరలు పెరిగాయి.  
- మొత్తం టోకు ధరల సూచీలో దాదాపు 60 శాతం వాటా కలిగిన తయారీ రంగానికి సంబంధించి ధరల స్పీడ్‌ 10.62 శాతం (2021 డిసెంబర్‌) నుంచి 9.42 శాతానికి తగ్గింది.  
- ఇంధనం, విద్యుత్‌ బాస్కెట్‌లో ధరల స్పీడ్‌ డిసెంబర్‌లో 32.30 శాతం ఉంటే, సమీక్షా నెల జనవరిలో 32.27 శాతానికి స్వల్పంగా తగ్గింది. 
 

మరిన్ని వార్తలు