దూసుకొస్తున్న క్రిప్టో కరెన్సీ బ్యాంక్ 

29 Jul, 2021 20:27 IST|Sakshi

దేశంలో కాషా కార్యకలాపాలు  విస్తరణ

పొదుపు ఖాతా, ఎఫ్‌డీ, ఆర్‌డీ లాంటి సేవలు

సాక్షి, ముంబై: ఇటీవలి క్రిప్టోకరెన్సీకి ఆదరణపెరుగుతున్న నేపథ్యంలో యూకేకు చెందిన క్రిప్టో బ్యాంక్ కాషా భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. కాషా, యునైటెడ్ మల్టీ స్టేట్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీల జాయింట్ వెంచర్ అయిన క్రిప్టో బ్యాంక్ యునికాస్ ఆగస్టు15 నాటికి  దేశంలో కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తోంది.  ప్రపంచంలోని మొట్టమొదటి క్రిప్టోకరెన్సీ బ్యాంకుగా అవతరించనున్నామని  యూనికాస్‌ వెల్లడించింది. 

ఇతర బ్యాంకుల మాదిరిగానే క్రిప్టో బ్యాంక్ పొదుపు, రుణ, వాణిజ్య సేవలను అందిస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన వెంటనే, బ్యాంక్ ఎఫ్‌డీల మాదిరిగానే బిట్‌కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలలో ఎఫ్‌డీలను,ఆర్‌డీలను  ప్రారంభించాలని భావిస్తోంది. క్రిప్టో ఎఫ్‌డీకి నిర్దిష్ట మెచ్యూరిటీ వ్యవధి ఉంటుంది. అదేవిధంగా, ఇతర బ్యాంకుల ఆర్డీ మాదిరిగానే చిన్న పెట్టుబడిదారులు  చిన్న మొత్తంలో రోజువారీ  పెట్టుబడి పెట్టడానికి యూనికాస్‌ అనుమతించాలని యోచిస్తోంది.

రిటైల్ పెట్టుబడిదారులు, వ్యాపారులను ఆకర్షించడమే లక్ష్యమనీ, రీటైల్‌ పెట్టుబడిదారులు తమ భవిష్యత్ అవసరాల నిమితం పెట్టుబడిపెట్టేలా ప్రోత్సహిస్తామని  యునికాస్ మేనేజింగ్ పార్టనర్‌, సీఈఓ దినేష్ కుక్రేజా చెప్పారు. ఎఫ్‌డిలతోపాటు ఆర్‌డీల మాదిరిగానే, చిన్నపెట్టుబడిదారులు చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టొచ్చన్నారు. ప్రస్తుతం యునికాస్‌కు దేశంలో ఢిల్లీ, జైపూర్, గుజరాత్‌లో మూడు శాఖలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం రాజస్థాన్ లోని జైపూర్‌లో ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా మరిన్ని శాఖలను ప్రారంభించాలని  భావిస్తున్నామని  కుక్రేజా చెప్పారు.

క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ జెబ్‌పే, ఇప్పటికే ఎఫ్‌డీలను ఆఫర్‌ చేస్తోంది. ఇక్కడ క్రిప్టోకరెన్సీని 90 రోజుల వరకు డిపాజిట్‌ చేసి స్థిర వడ్డీని సంపాదించవచ్చు మరోవైపు యునికాస్ క్రిప్టో కరెన్సీ పొదుపు ఖాతాలపై సంవత్సరానికి 4 శాతం నుండి 9.67 శాతం దాకా వడ్డీ  అందిస్తుంది. అంతేకాదు క్రిప్టో బ్యాంక్ ఫిజికల్‌ బ్రాంచెస్‌ ఉన్న నగరాల్లో  తన ప్రీమియం కస్టమర్లకు  డోర్-స్టెప్ సేవలను కూడా అందిస్తుంది.

మరిన్ని వార్తలు