క్రిప్టోకరెన్సీ చట్టం: ముగియనున్న సమావేశాలు! క్రిప్టో బిల్లుపై జాప్యానికి కారణాలు ఏంటంటే..

20 Dec, 2021 16:56 IST|Sakshi

క్రిప్టోకరెన్సీ బిల్లు.. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు ముందు నుంచే మొదలైన హడావిడి. ప్రైవేట్‌ క్రిప్టో అడ్డుకట్టవేయడం,  ఆర్బీఐ సొంత డిజిటల్‌ కరెన్సీని తీసుకొచ్చే ప్రయత్నాలకూ ఈ సమావేశాల్లోనే లైన్‌ క్లియర్‌ అవుతుందని అంతా భావించారు. అయితే బిల్లు డ్రాఫ్ట్‌ సర్వం సిద్ధమైందన్న ఆర్థిక మంత్రి ప్రకటన.. కేవలం ప్రకటనకే పరిమితం కావడం, మరో మూడు రోజుల్లో సమావేశాలు ముగుస్తుండడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.


బిజినెస్‌ న్యూస్‌ ఏజెన్సీ బ్లూమరాంగ్‌.. క్రిప్టోకరెన్సీ బిల్లు ఈ సమావేశాల్లో పార్లమెంట్‌ ముందుకు రాకపోవచ్చనే ఓ కథనం ప్రచురించింది. మరో మూడు రోజుల్లో (డిసెంబర్‌ 23తో) పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో చట్టానికి సంబంధించిన విధివిధానాల గురించి కేంద్రం తుది నిర్ణయానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. 


నిర్మలమ్మ చెప్పినా కూడా.. 

ప్రతిపాదిత క్రిప్టోకరెన్సీల చట్టంపై అనవసర ఊహాగానాలు మీడియాలో ప్రచారమైన నేపథ్యంలో ఆమధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన చేశారు. సంబంధిత వర్గాలందరితో చర్చించాకే పక్కా బిల్లు రూపొందించామని, కేబినెట్‌ ఆమోదించాకే దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నామని ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో  ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ, అధికారిక డిజిటల్‌ కరెన్సీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు దాదాపు ఖరారు చేసేసుకున్నారు. కానీ, బిల్లు ఇప్పటికీ కేబినేట్‌ అనుమతి పొందలేదు. 


వేగిరపాటు వద్దనే.. 

సిడ్నీ డైలాగ్‌ వర్చువల్ కీనోట్ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ... ‘ క్రిప్టోకరెన్సీలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే భారీ ప్రమాదం పొంచి ఉందన్నారు. అంతేకాకుండా యువతను కూడా  నాశనం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీతో ఏలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవడానికి అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాలని కోరారు. ఆ వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన క్రిప్టో వ్యవహారంపై సమావేశాన్ని కూడా నిర్వహించారు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు భావించారు.

నిజానికి క్రిప్టో బిల్లు ప్రస్తావనను శీతాకాల సమావేశాల షెడ్యూల్‌లో చేర్చిన కేంద్రం.. పార్లమెంట్‌ వెబ్‌సైట్‌లో సైతం ఆ విషయాన్ని పేర్కొంది. కానీ, ఇప్పుడు క్రిప్టో బిల్లు విషయంలో తొందరపాటు నిర్ణయం వద్దనే కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని మార్పులు చేర్పులతో ఆర్డినెన్స్‌గానీ, ప్రత్యేక ఆర్డర్‌గానీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్లమెంట్‌ సమావేశాలు ముగిశాక.. ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలపై నిషేధం, నియంత్రణపై స్పష్టమైన చేర్పులతో కూడిన చట్టం చేయవచ్చనే(పార్లమెంట్‌ సమావేశాలు లేకున్నా చట్టం చేసే వెసులుబాటు ఉండడం) అంచనా.  


అంశాలు.. 

క్రిప్టోకరెన్సీ బిల్లు (నియంత్రణ)పై ఎలాంటి స్పష్టత లేకపోయినప్పటికీ.. అందులో అంశాల గురించి మాత్రం విస్తృత చర్చ జరిగింది. ఆర్బీఐ క్రిప్టో కరెన్సీని పూర్తిగా నిషేధించాలని కోరుతోంది. కానీ, కేంద్రం మాత్రం అందుకు సుముఖంగా లేదు.  క్రిప్టోకరెన్సీ హోల్డర్స్‌ ఆస్తులను ప్రకటించడానికి, రాబోయే కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉండటానికి వారికి  గడువు ఇవ్వాలనే ప్రతిపాదనలను సూత్రప్రాయంగా అంగీకరించిందని, క్రిప్టో చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇరవై నుంచి యాభై కోట్ల జరిమానా, ఏడాదిన్నర శిక్ష.. ఇలాంటి అంశాలు చేర్చిందని గతంలో బ్లూమరాంగే ఓ కథనం ప్రచురించింది. అంతేకాదు క్రిప్టో కరెన్సీ నియంత్రణను ఆర్బీఐకి, క్రిప్టో ఆస్తుల పర్యవేక్షణ(నియంత్రణ)ను సెబీకి అప్పగించే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. 


చైనాలిసిస్‌ నివేదిక ప్రకారం...2021లో భారత్‌లో క్రిప్టో ఇన్వెస్టర్లు ఏకంగా 641 శాతం మేర పెరిగారని వెల్లడించింది. అంతేకాకుండా 2021 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ప్రకారం 154 దేశాలలో క్రిప్టోకరెన్సీ యజమానుల సంఖ్య పరంగా రెండో స్థానంలో... 'క్రిప్టో-అవగాహన'లో ఏడో దేశంగా భారత్‌ నిలిచింది. దాదాపు కోటిన్నరమంది ఇన్వెస్టర్లు.. 45 వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టో ఆస్తుల్ని కలిగి ఉన్నారు. 

మరిన్ని వార్తలు