కోట్లకు కోట్లు విలువ చేసే క్రిప్టోకరెన్సీ మాయం.. హ్యాకర్లకు బెదిరింపు ఆపై బేరానికి దిగిన కంపెనీ!

29 Jan, 2022 19:18 IST|Sakshi

ఊహించని రీతిలో లాభాలను కురిపిస్తున్నాయనే ఆనందమే కాదు.. క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా హ్యాకర్ల ముప్పు పొంచి ఉండడంతో అభద్రతా భావానికి లోనవుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వాలు, ఆర్థిక విభాగాలు లేవనెత్తుతున్న అభ్యంతరాల్లో ఇది కూడా ఉంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. 
 
డిసెంట్రలైజ్డ్‌ ఫైనాన్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘క్యూబిట్‌ ఫైనాన్స్‌’ నుంచి సుమారు 80 మిలియన్‌ డాలర్ల (600 కోట్ల రూపాయలకు పైనే) క్రిప్టోకరెన్సీ చోరీకి గురైంది. పక్కాగా ప్లాన్‌ చేసిన హ్యాకర్లు ఈ ఏడాది ఆరంభంలోనే ఈ భారీ చోరీకి పాల్పడ్డారు. ఇది గ్రహించిన క్యూబిట్‌ ఫైనాన్స్‌.. హ్యాకర్లతో బేరానికి దిగింది. మొదట కొంచెం సీరియస్‌గానే వార్నింగ్‌ ఇచ్చిన క్యూబిట్‌.. అటుపై కొంచెం తగ్గి ట్వీట్లు చేసింది.

కొట్టేసిందంతా తిరిగి ఇచ్చేయాలని, బదులుగా.. మంచి నజరానా ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు ఎలాంటి న్యాయపరమైన చర్యలకు వెళ్లమని మాటిస్తోంది కూడా. ఇక క్రిప్టోకరెన్సీలో అరుదైన సర్వీస్‌ను క్యూబిట్‌ అందిస్తోంది. దీని ప్రకారం.. బ్రిడ్జ్‌ అనే సర్వీస్‌లో వివిధ రకాల బ్లాక్‌చెయిన్స్‌ ఉంటాయి. డిపాజిట్‌ చేసిన క్రిప్టోకరెన్సీని వేరొకదాంట్లోనూ విత్‌డ్రా చేసుకోవచ్చు. 

అయితే 2020లో బినాన్స్‌ స్మార్ట్‌చెయిన్‌ను లాంఛ్‌ చేసినప్పటి నుంచి డెఫీ(అప్‌కమింగ్‌ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ) ప్రాజెక్టులకు హ్యాకింగ్‌ తలనొప్పులు ఎదురవుతున్నాయి. కిందటి ఏడాది ఏప్రిల్‌లో యురేనియం ఫైనాన్స్‌ నుంచి 50 మిలియన్‌ డాలర్లు, మే నెలలో వీనస్‌ ఫైనాన్స్‌ నుంచి 88 మిలియన్‌ డాలర్లు హ్యాకర్ల బారినపడింది.

చదవండి: క్రిప్టో దెబ్బకి మిలియనీర్ల నుంచి బికారీలుగా మారిన వేలమంది!

మరిన్ని వార్తలు