’కరెంటు అకౌంట్‌’ నిబంధనల మార్పు,ప్రైవేట్‌ బ్యాంకులకు ఊతం!

14 Jul, 2022 09:42 IST|Sakshi

ముంబై: గత రెండేళ్లుగా ప్రైవేట్‌ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్‌ తదితర బ్యాంకులు నగదు నిర్వహణ సేవల (సీఎంఎస్‌) విభాగంలో  తమ వాటాను పెంచుకునేందుకు కరెంటు ఖాతాల నిబంధనల్లో మార్పులతో ఊతం లభించింది. 

2020లో దేశీయంగా సీఎంఎస్‌లో వీటి వాటా 35 శాతంగా ఉండగా 2022లో ఇది 40 శాతానికి చేరింది. క్రిసిల్‌ రేటింగ్స్‌ నిర్వహించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. బ్యాంకులు–కార్పొరేట్ల మధ్య కనీస లావాదేవీల స్థాయిని నిర్దేశిస్తూ 2020లో ఆర్‌బీఐ సర్క్యులర్‌ విడుదల చేసింది. బడా బ్యాంకులకు తమ మార్కెట్‌ వాటాను పెంచుకునేందుకు దీనితో పాటు గత కొన్నేళ్లుగా అవి వినూత్న డిజిటల్‌ సర్వీసులు అందిస్తుండటం కూడా కొంత కారణమని క్రిసిల్‌ నివేదిక వివరించింది.
 
2020లో నిర్వహించిన సర్వేలో దేశీ సీఎంఎస్‌కు సంబంధించి 656 మంది, 2022లో 518 మంది పాల్గొన్నారు. బడా కార్పొరేట్‌ బ్యాంకింగ్‌ విషయంలో ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా టాప్‌ ర్యాంక్‌ దక్కించుకోగా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తర్వాత స్థానంలో ఉన్నాయి. మధ్య స్థాయి కార్పొరేట్‌ బ్యాంకింగ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అగ్రస్థానంలోనూ, ఐసీఐసీఐ .. యాక్సిస్‌ బ్యాంకులు తర్వాత స్థానాల్లోనూ ఉన్నాయి. వ్యాపార వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దేశీ కార్పొరేట్లు కొత్తగా పెట్టుబడులు పెట్టే క్రమంలో ఇటు వర్కింగ్‌ క్యాపిటల్‌ను, అటు ఆదాయవ్యయాల నిర్వహణపైనా మరింతగా దృష్టి పెడుతున్నట్లు సర్వే నివేదిక పేర్కొంది.   
 

మరిన్ని వార్తలు