పెట్రోలు ధరలపై కేంద్ర ఆర్థిక మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

16 Aug, 2021 19:57 IST|Sakshi

పెట్రోలు ధర వంద రూపాయల మార్క్‌ను దాటేసి వాహనదారులను హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఆగకుండా పెరుగుతున్న ధరల వల్ల బంకు వెళ్లిన ప్రతీసారీ సామాన్యుడు బడ్జెట్‌ లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. అయితే, ఈ పెట్రోల్ ధరలపై కేంద్ర ఆర్ధిక మంత్రి మళ్లీ పాత పాట పాడారు. యూపీఏ హయాంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అసలు, వడ్డీని చెల్లించాల్సి వస్తుందని, ఈ చెల్లింపుల కారణంగానే ధరలు పెరుగుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగస్టు 16న మీడియా సమావేశంలో అన్నారు. గత యూపీఏ ప్రభుత్వం రూ.1.3 లక్షల కోట్ల ఆయిల్ బాండ్ బిల్లులు, రూ.37,340 కోట్ల వడ్డీని తిరిగి చెల్లించలేదని తెలిపారు.

ఒక మీడియా సమావేశంలో తమిళనాడు తరహాలో కేంద్రం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తుందా అని విలేఖరి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక మంత్రి సీతారామన్ ఇలా సమాధానం ఇచ్చారు.. "మేము గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అన్నింటిని జాబితా చేస్తూ 2014లో ఒక తెల్ల కాగితాన్ని విడుదల చేసి ఉండాల్సింది. చమురు బాండ్లు దానిలో పెద్ద భాగం. గత యూపీఏ ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలకు చమురు బాండ్ల జారీ చేయడం వల్ల ఇంధన ధరలు తగ్గాయి. ఇప్పటికీ ఆ భారాన్ని ప్రజలు మోస్తున్నట్లు" అన్నారు. లీటరు పెట్రోల్ రేటుపై రూ.3 ఇంధన పన్నును తగ్గిస్తూన్నట్లు తమిళనాడు ప్రభుత్వం ఆగస్టు 13న ప్రకటించింది. ఈ తగ్గింపు వల్ల ఆ రాష్ట్ర ఖజానా మీద ఏడాదికి రూ.1,160 కోట్ల భారం పడనుంది.
 

మరిన్ని వార్తలు