బ్యాంకుల విలీనంతో ఖాతాదారుల పరిస్థితి అంతేనా..!

3 Apr, 2021 08:42 IST|Sakshi

చిన్న బ్యాంకుల కస్టమర్లకు సర్వీసు సమస్యలు

మార్పుల అమలు డెడ్‌లైన్‌ పొడిగించాలని విజ్ఞప్తులు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల విలీన పరిణామాలతో కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొత్త మార్పుల కారణంగా గతంలో ఇచ్చిన పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు బౌన్సయితే చార్జీల భారం పడటం, డివిడెండ్‌ చెల్లింపులను సక్రమంగా అందకపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద బ్యాంకుల్లో విలీనమైన చిన్న బ్యాంకుల కస్టమర్లే ఎక్కువగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాత ఎంఐసీఆర్‌ చెక్కుల స్థానంలో కొత్త వాటిని జారీ చేసేందుకు, డివిడెండ్లు మొదలైనవి చెల్లించాల్సిన సంస్థలకు కొత్తగా మారిన ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ వివరాలను అందించేందుకు మరింత సమయం పట్టేయనున్నందున విలీన అమలు ప్రక్రియ డెడ్‌లైన్‌ను మరింతగా పొడిగించాలని కోరుతున్నారు. వాస్తవానికి ఇది మార్చి 31తో ముగిసింది.  

అకౌంట్ల అనుసంధానంలో సమస్యలు..
ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) నాలుగు పీఎస్‌బీల్లో విలీనం చేసిన ఉత్తర్వులు 2020 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంకుల సిస్టమ్స్‌ మొదలైన వాటి అనుసంధానం, కొత్త ఇండియన్‌ ఫైనాన్షియల్‌ సిస్టం కోడ్‌ (ఐఎఫ్‌ఎస్‌సీ)ని అమల్లోకి తేవడం వంటి అంశాలకు మార్చి 31 డెడ్‌లైన్‌గా ప్రభుత్వం నిర్దేశించింది. అయితే,   అకౌంట్ల అనుసంధానం మొదలుకుని ఇతరత్రా పలు సమస్యలు ఇంకా ఉంటున్నాయని కస్టమర్లు, పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.

సాధారణంగా పెద్ద బ్యాంకుల్లో విలీనమైన చిన్న బ్యాంకుల కస్టమర్లలో చాలా మందికి ఏవో కంపెనీల్లో షేర్లో లేదా బాండ్లలో పెట్టుబడులో ఉండే అవకాశముంది. వాటి మీద డివిడెండ్లు, ఇతరత్రా చెల్లింపులు మొదలుకుని ఐటీ రీఫండ్‌లు కూడా రావాల్సి ఉండొచ్చు. అయితే, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ మారిపోవడం తదితర పరిణామాల వల్ల ఇలాంటివి పొందడం సమస్యగా మారే అవకాశం ఉంటోంది. పోనీ అలాగని కొత్త మార్పుల గురించి ఆయా సంస్థలకు తెలియజేయాలన్నా చాలా సమయం పట్టేయొచ్చు. ఈ నేపథ్యంలోనే డెడ్‌లైన్‌ను మూడు నెలల పాటు పొడిగించాలని కస్టమర్లు కోరుతున్నారు.  ఇక కొత్త మార్పులకు అలవాటు పడేందుకు కూడా ఖాతాదారులకు ఇబ్బందిగా ఉంటోంది.

ఉదాహరణకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)లో విలీనమైన యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) ఓ కస్టమరు విషయం తీసుకుంటే.. దాదాపు అన్ని లావాదేవీలకు గతంలో ఈ–యూబీఐ యాప్‌ ఉపయోగించేవారు. కానీ విలీనం తర్వాత ప్రస్తుతం కొత్త యాప్‌ను వినియోగించడం చాలా మటుకు తగ్గించేశారు. యాప్‌ చాలా సంక్లిష్టంగానే కాకుండా నెమ్మదిగా లోడ్‌ అవుతుండటం కూడా ఇందుకు కారణమని వివరించారు. ఇక తండ్రి మరణానంతరం ఆయనకు చెందిన సీనియర్‌ సిటిజెన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ అకౌంటు నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవడానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయడానికి దాదాపు నెల రోజులు పైగా పట్టేసిందని మరో యూబీఐ ఖాతాదారు వాపోయారు. ఇలాంటి సాంకేతిక సమస్యలతో విలీన బ్యాంకుల కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.  

విలీనం ఇలా..
యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంక్‌ విలీనమయ్యాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను విలీనం చేశారు. కెనరా బ్యాంకులో సిండికేట్‌ బ్యాంకు, ఇండియన్‌ బ్యాంకులో అలహాబాద్‌ బ్యాంకు విలీనమయ్యాయి.  

చదవండి: రిటైల్‌ రుణాలు.. రయ్‌రయ్‌!

మరిన్ని వార్తలు