సైబర్‌ మోసాలపై వెంటనే ఫిర్యాదు...లేదంటే! ఎస్‌బీఐ కీలక హెచ్చరిక

25 Oct, 2022 12:45 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశంలో ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్, డిజిటల్ మోసాల కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కీలక సూచనలు జారీ చేసింది. డిజిటల్‌  చెల్లింపు, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవల్లో అనధికారిక లావాదేలపై తక్షణమే ఫిర్యాదు చేయాలని కస్టమర్లను అప్రమత్తం చేసింది. తద్వారా ఇంటర్నెట్ వినియోగదారులు ఫిషింగ్, ర్యాన్‌సమ్‌ దాడుల నుండి, సైబర్  కేటుగాళ్ల మోసాలనుంచి సురక్షితంగా ఉండవచ్చని  పేర్కొది. 

ఎస్‌బీఐ ఖాతాకు సంబంధించి ఏదైనా ఆర్థిక మోసం జరిగినట్లయితే, ఖాతాదారుడు ఫిర్యాదు చేయాలని తెలిపింది. పెరుగుతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు తమ ఖాతాల్లో ఏదైనా అనధికార లావాదేవీలు జరిగితే వెంటనే రిపోర్ట్ చేయాలని తెలిపింది. అలా కాకుండా  ఫిర్యాదుకు ఎక్కువ సమయం తీసుకుంటే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఎస్‌బీఐ పేర్కొంది. అనధికార లావాదేవీని గమనించిన  వెంటనే తమ టోల్-ఫ్రీ నంబర్ 18001-2-3-4కు తెలియజేయాలని వెల్లడించింది. తద్వారా సకాలంలో సరైన చర్యలు తీసుకొనే అవకాశం తమకు ఉంటుందని, లేదంటే భారీ మూల్యం తప్పదని పేర్కొంది. 1800 1234 లేదా 1800 2100లో తమ కాంటాక్ట్ సెంటర్‌ టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసిఎస్‌బీఐ బ్యాంకింగ్ అవసరాలను  తీసు కోవచ్చంటూ  ట్వీట్‌ చేసింది. 

ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవల్లో  సైబర్‌  నేరగాళ్ల  ఎత్తులనుంచి, సైబర్ దాడులనుంచి కస్టమర్లు తమని తాము రక్షించు కోవడం చాలా ముఖ్యమని పేర్కొంది. టోల్-ఫ్రీ నంబర్‌ను డయల్ చేయడంతో పాటు, కస్టమర్‌లు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం,  మొబైల్ బ్యాంకింగ్ , భీమ్‌ ఎస్‌బీఐ పే సేవలకు సంబంధించిన ఫిర్యాదులను బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా కూడా నమోదు చేయవచ్చని ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత మోసపూరిత ఛానెల్‌ను బ్లాక్‌ చేస్తామని ఎస్‌బీఐ వెల్లడించింది. రిజిస్టర్డ్ ఫిర్యాదు నంబర్, ఇతర వివరాలను కస్టమర్‌కు ఎస్‌ఎంఎస్‌, ఇమెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తామనీ, అలా వచ్చిన ఫిర్యాదును 90 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపింది. 

మరిన్ని వార్తలు