నగదు చెల్లింపుల కోసం క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌.. ఇవి తెలుసుకోకపోతే జేబుకి చిల్లే!

13 Nov, 2022 14:57 IST|Sakshi

ఓ టెక్కీ బ్యాంక్‌ నుంచి మెయిల్‌లో వచ్చిందని అనుకుని తన మొబైల్‌కు వచ్చిన క్యూ ఆర్‌కోడ్‌ ను స్కాన్‌ చేశాడు. వెంటనే అతని ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, బ్యాంకు అకౌంట్‌ పిన్‌లను సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. కొద్దిసేపటి తరువాత అతని బ్యాంకు అకౌంట్‌లో ఉన్న నగదు కూడా ఖాళీ అయింది,  వ్యక్తిగత ఫోటోలను చూపి దుండగులు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు తెలిపాడు.  

ఇటీవల టెక్నాలజీ వాడకం పెరిగే కొద్దీ నేరగాళ్లు కొత్త దారులను ఎంచుకుంటున్నారు. కాలానుగుణంగా కొత్త రకం దోపిడికి వ్యూహాలు రచ్చిస్తున్నారు. మన బ్యాంక్‌ నుంచి మనకి తెలియకుండానే నగదు ఖాళీ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వాటిపై కాస్త అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

క్యూఆర్‌ కోడ్‌తో జాగ్రత్త..
క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ పేరుతో కేటుగాళ్లు కొత్త రకం దోపిడికి స్కెచ్‌ వేస్తున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే మీరు ఇబ్బందుల్లో పడక తప్పదు. బ్యాంక్‌ నుంచి నగదు తీసుకోవడానికి ఓ వ్యక్తి క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి మోసపోగా మరో రెస్టారెంట్‌లో పెట్టిన క్యూ ఆర్‌కోడ్‌ను మార్చివేసి తమ అకౌంట్‌ కు నగదు జమఅయ్యేలా చేసి వంచనకు పాల్పడిన ఘటనలు ఇటీవల ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 

మోసగాళ్లు పలు కేంద్రాల్లో( రెస్టారెంట్లు, షాపుల్లో, కస్టమర్లు రద్దీ ఉండే ప్రాంతాలు) యజమానులకు తెలియకుండా అక్కడి క్యూ ఆర్‌కోడ్‌ను మార్చి తమ క్యూఆర్‌ సంకేతాన్ని ఉంచుతున్నారు. ఇది తెలియక కస్టమర్లు తమ బిల్లులు చెల్లించడానికి క్యూ ఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేసి అందులోకి డబ్బులను పంపుతున్నారు. అయితే చివరికి ఈ పైసలన్నీ మోసగాళ్ల ఖాతాల్లోకి జమఅవుతున్నాయి. మరో వైపు రెస్టారెంట్‌లో రోజురోజుకు ఆదాయం తగ్గుతుండటంతో దీనిపై విచారించిన యజమానులకు అసలు నిజం తెలియంతో ఈ తరహా మోసాలు బయటపడ్డాయి.

చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్‌: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా!

మరిన్ని వార్తలు