గతం కంటే తగ్గాయి.. అయినా సైబర్‌ క్రైం నేరాల్లో ఆ నగరమే టాప్‌!

7 Sep, 2022 16:28 IST|Sakshi

అత్యధిక సైబర్‌ నేరాల కేసులతో దేశంలోని మహానగరాల్లో బెంగళూరు మొదటిస్థానంలో నిలిచింది. 2021లో రోజుకు సరాసరి 18 కేసులు నమోదయ్యాయి. 2021 సంవత్సరపు నేరాలపై జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన నివేదికలో ఈ చేదు వాస్తవం వెల్లడైంది. 20 లక్షలకంటే ఎక్కువ జనాభా కలిగిన 19 మహానగరాల్లో నమోదైన సైబర్‌ నేరాలను పరిశీలించగా బెంగళూరు టాప్‌లో నిలిచింది.

బెంగళూరు ఐటీ, బీటీ, ఇతర ప్రముఖ ప్రైవేటు కంపెనీలకు నిలయం. ఆర్థిక లావాదేవీలు అత్యధికంగా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సైబర్‌ కేటుగాళ్లు నగరంపై గురిపెట్టి ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. వరుసగా బెంగళూరు, హైదరాబాద్, ముంబై సిలికాన్‌ సిటీ 6,423 కేసులతో దేశంలో మొదటిస్థానం, 3,303 కేసులతో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ రెండవ స్థానం, ఇక 2,883 సైబర్‌ నేరాలతో ముంబయి నగరం మూడవ స్థానంలో నిలిచింది.   

గతం కంటే తగ్గాయి
అయితే గతం కంటే బెంగళూరు నగరంలో 2021లో సైబర్‌ నేరాలు తగ్గుముఖం పట్టడం శుభసూచకమనే చెప్పాలి. 2019లో 10,555 కేసులు, 2020లో 8,982 కేసులు నమోదైనట్లు నివేదికలో ప్రస్తావించారు. సైబర్‌నేరాల్లో బాధితులకు న్యాయం దొరికేది చాలా తక్కువ. ఇలా ఉండగా మెజారిటీ కేసుల్లో వంచకులను అరెస్ట్‌ చేయడం పోలీసులకు సాధ్యం కావడం లేదని బెంగళూరువాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: మరో బాదుడు.. కెనరా బ్యాంక్‌ రుణ రేటు పెంపు

మరిన్ని వార్తలు