సైయంట్‌ చేతికి సైటెక్‌

26 Apr, 2022 17:02 IST|Sakshi

న్యూఢిల్లీ: గ్లోబల్‌ ప్లాంట్, ప్రొడక్ట్‌ ఇంజనీరింగ్‌ సర్వీసుల సంస్థ సైటెక్‌ను కొనుగోలు చేసినట్లు ఐటీ సేవల హైదరాబాద్‌ కంపెనీ సైయంట్‌ తాజాగా పేర్కొంది. ఇందుకు నగదు రూపేణా సుమారు రూ. 800 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. తద్వారా బిజినెస్‌ ఆఫరింగ్స్‌ను మరింత పటిష్టపరచుకోనున్నట్లు తెలియజేసింది. 1984లో ఏర్పాటైన సైటెక్‌ అంతర్జాతీయ ప్లాంట్, ప్రొడక్ట్‌ ఇంజనీరింగ్‌ సరీ్వసులను అందిస్తోంది. ఎనర్జీ, మైనింగ్, ప్రాసెస్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, తయారీ రంగాలలో కస్టమర్లను కలిగి ఉంది.

 ప్రపంచవ్యాప్తంగా 1,200 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. కాగా.. ఇంజనీరింగ్‌ సర్వీసులు కంపెనీ చేపట్టిన అతిపెద్ద విదేశీ కొనుగోలుగా ఇది నిలవనున్నట్లు సైయంట్‌ పేర్కొంది. అంతేకాకుండా సైయంట్‌ చరిత్రలోనూ ఇది అతిపెద్ద కొనుగోలుగా వెల్లడించింది. ఈ త్రైమాసికంలోనే కొనుగోలు పూర్తికానున్నట్లు తెలియజేసింది. సైటెక్‌కున్న పటిష్ట బ్రాండు విలువ, నిపుణుల శక్తి ప్రధానంగా నార్డిక్‌ ప్రాంతంలో కంపెనీకి బలాన్ని చేకూర్చగలవని సైయంట్‌ ఎండీ, సీఈవో బోదనపు కృష్ణ పేర్కొన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో కంపెనీ మరింత విస్తరించగలదని తెలియజేశారు. 2021లో సైటెక్‌ 8 కోట్ల యూరోల(సుమారు రూ. 660 కోట్లు) ఆదాయం ఆర్జించినట్లు వెల్లడించారు. 14,000 మంది నిపుణులతో కార్యకలాపాలు విస్తరించిన సైయంట్‌.. తమ కస్టమర్లకు కొత్త సర్వీసులను అందించడంతోపాటు, ఉద్యోగులకు మరిన్ని అవకాశాలను కల్పించనున్నట్లు సైటెక్‌ సీఈవో జొహాన్‌ వెస్టర్‌మార్క్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు