సైరస్‌ మిస్త్రీ మరణం, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ బాధ్యతలు ఎవరు చూసుకుంటారంటే!

5 Sep, 2022 14:01 IST|Sakshi

157ఏళ్ల చరిత్ర, మల్టీ బిలియన్‌ డాలర్ల సంస్థ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ మూగబోయింది. ఆ గ్రూప్‌ ఛైర్మన్‌గా వ్యవహరించిన షాపూర్జీ పల్లోంజీ ఈ ఏడాది జూన్‌ 28న మరణించగా, ఇప్పుడు సైరస్‌ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో కన్ను మూయడం వ్యాపార సామ్రాజ్యానికి తీరని లోటుని మిగిల్చాయి. అయితే ఇప్పుడు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారనేది చర్చాంశనీయంగా మారగా..సైరస్‌ మిస్త్రీ అతని పిల్లలు, సోదరుడే నిర‍్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సైరస్ మిస్త్రీ, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. 

 ఇది చదవండి: సైరస్ మిస్త్రీ హఠాన్మరణం: ఆనంద్‌ మహీంద్ర భావోద్వేగం

1865లో సైరస్‌ మిస్త్రీ ముత్తాత పల్లోంజి మిస్త్రీ..లిటిల్‌వుడ్ పల్లోంజీ అండ్‌ కో సంస్థను స్థాపించారు. ఆ తర్వాతి కాలంలో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌గా మారింది.   

సుమారు 30 బిలియన్‌ డాలర్ల నికర సంపద కలిగిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు.. టాటా గ్రూప్‌లో 18.6శాతం వాటాలున్నాయి. 

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. 2022లో షాపూర్జీ గ్రూప్‌ దాదాపు 30 బిలియన్ల నికర విలువను కలిగి ఉంది.

2016 అక్టోబర్‌లో జరిగిన బోర్డ్‌ మీటింగ్‌లో టాటా గ్రూప్‌..సైరస్ మిస్త్రీని ఛైర్మన్‌గా తొలగించింది. ఆ నిర్ణయంతో భారత దేశ చరిత్రలో కార్పొరేట్‌ దిగ్గజ సంస్థల మధ్య వైరం మొదలైంది. 

సైరస్ మిస్త్రీ పర్యవేక్షణలో, టాటా గ్రూ‍ప్‌కు చెందిన టాప్-20 లిస్టెడ్ గ్రూప్ కంపెనీల వార్షిక వృద్ధి రేటు 12.5 శాతం పెరిగింది. 

టాటా గ్రూప్‌ మొత్తం నికర లాభం 42.3 శాతంతో వృద్ది చెందింది. సైరస్‌ మిస్త్రీ టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గా విధులు నిర్వహించే సమయంలో కార్యకలాపాల్ని సమర్ధవంతంగా నిర్వహించారు. అతి తక్కువ కాలంలో 100 బిలియన్‌ డాలర్ల టర్నోవర్‌ సాధించింది. 

షాపూర్జీ పల్లోంజీ గ్రూప్.. నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్, రియల్ ఎస్టేట్, కన్స్యూమర్ గూడ్స్, సోలార్‌ పవర్‌, ఇంజనీరింగ్ అండ్‌ కన్‌ స్ట్రక్షన్‌లో కార్యకాలాపాల్ని నిర్వహించింది. 

50 కంటే ఎక్కువ దేశాలలో 50వేల మందికి పైగా ఉద్యోగులు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో పనిచేస్తున్నారు.  

సైరస్‌ మిస్త్రీ  2012 డిసెంబర్‌లో టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా నియమితులైనప్పటి నుండి.. సైరస్ తన అన్నయ్య షాపూర్ మిస్త్రీకి కుటుంబ వ్యాపార కార్యకలాపాల బాధ్యతల్ని నిర్వహించారు.    

2019 చివరి కాలంలో షాపూర్జీ గ్రూప్‌ నిర్వహణ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. షాపూర్ కుమారుడు పల్లోన్ (26) గ్రూప్ హోల్డింగ్ కంపెనీ బోర్డులో చేర్చారు. కుమార్తె తాన్య గ్రూప్ కార్పొరేట్ బాధ్యల్ని నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు