Cyrus Mistry: టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ కన్నుమూత

4 Sep, 2022 16:37 IST|Sakshi

మహరాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ మరణించారు. సైరస్‌ మిస్త్రీ మెర్సిడెస్‌ బెంజ్‌ కారులో అహ్మదాబాద్‌ నుంచి ముంబైకి వస్తున్నారు. మార్గం మధ‍్యలో మహరాష్ట్ర పాల్ఘర్‌ జిల్లాలో సూర్య నది వంతెనపై ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో సైరస్‌ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.


సైరస్‌ మిస్త్రీ విద్యాభ్యాసం
1968 జులై 4న ముంబైలో పల్లోంజి మిస్త్రీ, పాట్ పెరిన్ దుబాష్ దంపతులకు సైరస్‌ మిస్త్రీ జన్మించారు. లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌లో బిజినెస్‌ స్కూల్‌ మేనేజ్మెంట్‌లో ఎంఎంసీ చేసిన ఆయన ..1991లో తన ఫ్యామిలికి చెందిన ప్రముఖ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 

రతన్‌ టాటా స్థానంలో
2012లో రతన్‌ టాటా పదవీ విరమణతో టాటా గ్రూప్‌నకు సైరస్‌ మిస్త్రీ ఛైర్మన్‌ అయ్యారు. అదే సంవత్సరం డిసెంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవి చేపట్టిన నాలుగేళ్లకే అంటే 2016 అక్టోబర్ నెలలో టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ, టాటా సన్స్ బోర్డ్.. సైరస్‌ మిస్త్రీ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని సూచించింది. ఆ తరువాత ఛైర్మన్ పదవి నుండి తొలగించింది. ఎందుకంటే..సైరస్‌ మిస్త్రీ సంస్థ నిర్ధేశించిన లక్ష్యాల్ని చేరడంలో విఫలమయ్యారని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 

మిస్త్రీ తొలగింపు
మిస్త్రీ తొలగింపుతో మాజీ ఛైర్మన్ రతన్ టాటా తర్వాత తాత్కాలిక ఛైర్మన్‌గా కొనసాగారు. కొన్ని నెలల తర్వాత కొత్త ఛైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్ ఎంపికయ్యారు. చంద్ర శేఖరన్‌ ఎంపికపై  టాటా సన్స్‌లో 18.4శాతం వాటా ఉన్న మిస్త్రీ తన  తొలగింపును సవాల్‌ చేస్తూ నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించారు. అంతేకాదు తన రెండు ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలైన సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, స్టెర్లింగ్‌  ఇన్వెస్ట్‌మెంట్స్‌ల ద్వారా పలు ఆరోపణలు చేస్తూ రతన్‌ టాటాతో పాటు, టాటా సన్స్‌లోని మరో 20 మందిపై కేసు దాఖలు చేశారు. 

గెలుపుపై సుప్రీం స్టే 
తొలత సైరస్‌ మిస్త్రీ ఆరోపణల‍్ని ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చింది. దీంతో ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యూనల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ) వెళ్లారు. 3 ఏళ్ల న్యాయపోరాటంలో సైరస్‌ మిస్త్రీ గెలిచారు. ఆ తర్వాత టాటా సన్స్‌ ఎక్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా మిస్త్రీని తిరిగి నియమించాలని జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యూనల్‌ జారీ చేసింది. ఆ ఆదేశాలను 2021 మార్చి 26న సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. ప్రస్తుతం సైరస్‌ మిస్త్రీ ..షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తుండగా..ఇవాళ మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించడం పట్ల పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. 

మరిన్ని వార్తలు