Cyrus Mistry: గౌరవం కోసం పోరాటం..

5 Sep, 2022 06:18 IST|Sakshi

టాటా గ్రూప్‌ను కొత్త బాటలో నడిపే ప్రయత్నం

అత్యధిక వాటాలున్నా .. అర్ధాంతరంగా పదవుల నుంచి తొలగింపు

తుది వరకూ పోరాడిన సైరస్‌ మిస్త్రీ

ముంబై: పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. దీనితో, కొన్నాళ్ల క్రితమే టాటా గ్రూప్‌ నుంచి అర్ధాంతరంగా ఉద్వాసనకు గురైన మిస్త్రీ తాజాగా జీవితం నుంచి కూడా అర్ధాంతరంగా నిష్క్రమించినట్లయింది. టాటా సన్స్‌లో అత్యధికంగా 18 శాతం పైగా వాటాలున్న షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ తరఫున 2012లో టాటా గ్రూప్‌ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టే వరకూ.. కుటుంబ వ్యాపార వర్గాల్లో తప్ప సైరస్‌ మిస్త్రీ పేరు పెద్దగా బైట వినిపించేది కాదు.

1991లో మిస్త్రీ తమ కుటుంబ వ్యాపార సంస్థ షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌లో (ఎస్‌పీ) డైరెక్టరుగా చేరారు. 1994లో ఎండీగా నియమితులయ్యారు. ఎస్‌పీ గ్రూప్‌ కార్యకలాపాలు మెరైన్, ఆయిల్, గ్యాస్, రైల్వే తదితర రంగాల్లోకి విస్తరించడంలో ప్రధాన పాత్ర పోషించారు. 2006లో కీలకమైన టాటా సన్స్‌ బోర్డులో చేరారు. అప్పటివరకూ ఆయన పలు టాటా కంపెనీల బోర్డుల్లో సభ్యుడిగా కొనసాగారు. సాధారణంగా నలుగురిలో ఎక్కువగా కలవకపోయినా.. తెలిసినంత వరకూ వ్యాపార దక్షత విషయంలో ఆయనకు మంచి పేరు ఉండేది.

ఇదే టాటా గ్రూప్‌ చీఫ్‌ రతన్‌ టాటా తన వారసుడిగా మిస్త్రీని ఎంచుకునేలా చేసింది. వాస్తవానికి టాటా పగ్గాలు చేపట్టడానికి మిస్త్రీకి ఇష్టం లేకపోయినప్పటికీ రతన్‌ టాటా స్వయంగా నచ్చచెప్పడంతో ఆయన అంగీకరించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతాయి. అలా 44 ఏళ్ల వయస్సులో, దేశంలోనే అతి పెద్ద దిగ్గజాల్లో ఒకటైన టాటా గ్రూప్‌ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న మిస్త్రీ సంస్థను కొత్త బాటలో నడిపించే ప్రయత్నం చేశారు. టాటాల కుటుంబానికి చెందిన వారు కాకుండా వేరొకరు టాటా గ్రూప్‌నకు సారథ్యం వహించడం అదే ప్రథమం. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రమాణాలను మెరుగుపర్చడంపై ఆయన దృష్టి పెట్టారు. నష్టాల్లో ఉన్న సంస్థలను, ఉత్పత్తులను నిలిపివేసి.. లాభదాయక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటివరకూ ఎక్కువగా బిజినెస్‌ టు బిజినెస్‌ (బీ2బీ)కి పరిమితంగా ఉంటున్న సంస్థ .. మరింతగా వినియోగదారులకు సంబంధించిన ఉత్పత్తులు, సేవలవైపు మళ్లే విధంగా ప్రణాళికలను రూపొందించేందుకు కృషి చేశారు. ఇందుకోసం తగు సిఫార్సులు చేసేందుకు టాటా గ్రూప్‌లోని సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు, పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలతో ఒక గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ను (జీఈసీ) ఏర్పాటు చేశారు.  

టాటాతో విభేదాలు.. ఉద్వాసన ..  
అయితే, ఈ క్రమంలో వ్యాపార వ్యవహార శైలి విషయంలో మిస్త్రీ, రతన్‌ టాటాల మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి 2016 అక్టోబర్‌లో ఆయన అర్ధాంతరంగా చైర్మన్‌ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఆ తర్వాత టాటా సన్స్‌ డైరెక్టరుగా కూడా ఆయన్ను తప్పించారు. మిస్త్రీ కుటుంబం అతి పెద్ద వాటాదారే అయినప్పటికీ సైరస్‌ తన పదవిని కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఎన్‌ చంద్రశేఖర్‌ (టీసీఎస్‌ చీఫ్‌) .. గ్రూప్‌ పగ్గాలు అందుకున్నారు.  

న్యాయస్థానాల్లో చుక్కెదురు..
అవమానకరంగా తనను పంపించిన తీరుపై మిస్త్రీ  న్యాయపోరుకు దిగారు. స్వయంగా టాటాపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘అహంభావంతో ఒక్కరు’’ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో గ్రూప్‌ వ్యాపారానికి నష్టం జరుగుతోందని, టాటా వాస్తవాలు మాట్లాడటం లేదని ఆరోపించారు. తనను తొలగించడంపై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీ) ఆశ్రయించారు. అంతకు కొన్నాళ్ల క్రితమే తన పనితీరు అద్భుతమని ప్రశంసించి, అంతలోనే అలా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు.

ఈ క్రమంలో బాంబే డయింగ్‌ చీఫ్‌ నుస్లీ వాడియా, ఆయన చిన్ననాటి స్నేహితురాలు.. ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే తదితరులు ఆయన పక్షాన నిల్చారు. అయితే, బోర్డు, మెజారిటీ వాటాదారులు ఆయనపై విశ్వాసం కోల్పోయారంటూ ఎన్‌సీఎల్‌టీ 2018లో మిస్త్రీ పిటీషన్‌ను తోసిపుచ్చింది. దీనిపై ఆయన నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)ని ఆశ్రయించగా ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కానీ దీనిపై టాటాలు సుప్రీం కోర్టులో అప్పీలు చేయగా 2021 మార్చిలో ఇచ్చిన తుది తీర్పులో.. అత్యున్నత న్యాయస్థానం టాటాల పక్షం వహించింది. అయితే, అంతకు ముందు తీర్పులో ఆయనపై చేసిన కొన్ని ప్రతికూల వ్యాఖ్యలను తొలగించడం ద్వారా కొంత ఊరటనిచ్చింది.

మరిన్ని వార్తలు