అచ్చం మనిషిలాగే ఆలోచించే డ్రోన్‌ టెక్నాలజీ! నిఘాలో కీలకం

10 Aug, 2021 12:02 IST|Sakshi

అన్నిరంగాల్లోనూ టెక్నాలజీకి ప్రాముఖ్యత పెరిగింది.  నేరాలను అరికట్టడానికి, నేర పరిశోధనలోనూ టెక్నాలజీ ఇప్పుడు ముఖ్య భూమిక పోషిస్తోంది. అయితే ఎంత టెక్నాలజీ ఉపయోగిస్తున్నా.. దానికంటూ కొన్ని పరిమితులు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పరిమితులను సైతం అధిగమించే ప్రయత్నాలు నడుస్తున్నాయి. తాజాగా చెక్‌ రిపబ్లిక్‌(యూరప్‌) సైంటిస్టులు.. డ్రోన్‌లకు  అచ్చు మనిషి బుర్ర లాంటి వ్యవస్థను బిగించారు. యస్‌.. మీరు చదివేది కరెక్టే. 

సాధారణంగా జన సందోహం ఎక్కువగా ఉన్న చోట మ్యాన్‌ పవర్‌తో నిఘా నిర్వహించడం కష్టతరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో డ్రోన్‌ ద్వారా కదలికలను పరిశీలిస్తుంటారు. అయితే డ్రోన్‌ సేవలు పరిమితమే కావడం, అనుమానిత కదలికలను సరిగా అంచనా వేయడంలో డ్రోన్‌లు విఫలమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మనిషి మేధస్సును డ్రోన్‌లకు బిగించాలని చెక్‌ సైంటిస్టులు ఫిక్స్‌ అయ్యారు. 

ఎలా పని చేస్తుందంటే.. 
మనిషి బుర్రలాంటి మెకానిజాన్ని(న్యూరాల్‌ నెట్‌వర్క్‌).. డ్రోన్‌లలో సెటప్‌ చేశారు. ఇది ఒక సర్వేలెన్స్‌ సిస్టమ్‌లాగా పని చేస్తుంది. ఏదైనా ఎదురైనప్పుడు మనిషిలాగే బుర్ర పెట్టి ఆలోచన స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. జన సందోహంలో మనుషుల ముఖ కవళికలు, ప్రవర్తన ద్వారా ఏది నార్మల్‌.. ఏది అబ్‌నార్మల్‌ అనేది నిర్ణయించుకుంటుంది. ప్రయోగదశలో ఫుట్‌బాల్‌ మైదానంలో ఆటగాళ్ల మీద ఈ ‘బ్రెయిన్‌ డ్రోన్‌’లను ప్రయోగించారు. ఆట కొనసాగుతున్నప్పుడు మధ్యలో ఆటగాళ్లు అబద్ధాలు చెప్పగా.. వెంటనే ఈ డ్రోన్‌ సిస్టమ్‌ పని చేయడం ప్రారంభించింది. ముందుగా  ఫుటేజ్‌ను చిన్న కణాలుగా(భాగాలుగా) విభజించింది. ఆపై పిక్చర్‌ క్లియర్‌​ ద్వారా అక్కడ ఏం జరుగుతుందనేది అనలసిస్‌ చేసింది. ఆటగాళ్ల ముఖ కవళికలు, వాళ్ల ప్రవర్తన ఆధారంగా వాళ్లు అబద్దం ఆడారనే ఒక నిర్ధారణకు వచ్చింది.  వెంటనే ఈ డ్రోన్‌ సిస్టమ్‌ అబ్జర్వర్‌(సైంటిస్ట్‌)ను అప్రమత్తం చేసింది.
 

కొంత ప్రతికూలత.. 
బ్రోనో యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, చెక్‌ రిపబ్లిక్‌ పోలీస్‌ వ్యవస్థ సహకారంతో ఈ హ్యూమన్‌ బ్రెయిన్‌ న్యూరాల్‌ నెట్‌వర్క్‌ను రూపొందించారు. కేవలం జన సందోహం నడుమ నిఘాతో పాటు ట్రాఫిక్‌ మనేజ్‌మెంట్‌ కోసం కూడా ఈ డ్రోన్‌ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఈ రియల్‌ టైం టెక్నాలజీ కీలక సమయాల్లో పని చేయడం మామూలు విషయం కాదన్నది సైంటిస్టుల మాట. అయితే జన సందోహం  ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డ్రోన్‌ సిస్టమ్‌ కొంత తడబడే ఛాన్స్‌ ఉంది. అందుకని సెన్సిటివ్‌ లెవల్‌ను ఏర్పాటు చేశాకే పూర్తిస్థాయిలో వాడకంలోకి తీసుకొస్తామని బ్రోనో సైంటిస్ట్‌ డేవిడ్‌ బేజౌట్‌ చెప్తున్నాడు.

మరిన్ని వార్తలు