నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌... భారీగా పతనమైన సెన్సెక్స్‌

20 Aug, 2021 15:49 IST|Sakshi

ముంబై: అమెరికాలో ద్రవోల్బణం ఎక్కువగా ఉందంటూ ఫెడరల్‌ రిజర్వ్‌ , యూఎస్‌ఏ చేసిన ప్రకటనతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు కుదేలయ్యాయి. ఏసియా మార్కెట్లలో అస్థిరత నెలకొంది. దాని ప్రభావం దేశీ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. ఈ రోజు ఉదయం మార్కెట్‌ ప్రారంభమైంది మొదలు ముగిసే వరకు ఇటు బీఎస్‌ఈ సెన్సెక్స్‌, అటు నిఫ్టీలు వరుసగా పాయింట్లు కోల్పోతూనే ఉన్నాయి. 

ఈ రోజు ఉదయం సెన్సెక్స్‌ 55,159వ పాయింట్లతో ప్రారంభమైంది. వెంటనే పాయింట్లూ కోల్పోతూ నష్టాల దిశగా వెళ్లింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కొద్ది సేపు మాత్రం గరిష్టంగా స్థాయిలకు చేరుకుని 55,543 పాయింట్ల దగ్గర ట్రేడయ్యింది. చివరకు మార్కెట్‌ ముగిసే సమయానికి 380 పాయింట్లు నష్టపోయి 55,248 పాయిం‍ట్ల దగ్గర క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ సైతం 150 పాయింట్లు నష్టపోయి 16,418 పాయింట్ల దగ్గర ముగిసింది.

బ్యాంకుషేర్లు నష్టాలపాలయ్యాయి. బ్లూచిప్‌ కంపెనీగా పేర్కొనే టాటా స్టీల్‌ షేర్లు సైతం నష్టాల బారిన పడ్డాయి. కోటక్‌ మహీంద్ర, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎస్‌బీఐ, లార్సెన్‌ అండ్‌ ట్రూబో షేర్లు నష్టపోయాయి.  భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పేయింట్స్‌, మారుతి, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభపడ్డాయి.

చదవండి: ఫోన్‌ కంపెనీలకు గూగుల్‌ భారీ ఆఫర్‌.. సీక్రెట్‌ కాంట్రాక్ట్‌లపై ఆగ్రహం

మరిన్ని వార్తలు