విలవిలాడుతున్న ఇన్వెస్టర్లు.. భారీగా నష్టపోతున్న మార్కెట్‌ సూచీలు

10 Jun, 2022 09:59 IST|Sakshi

ముంబై: అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్ల పాలిట శాపంగా మారాయి. ద్రవ్యోల్బణ కట్టడికి యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌, యూరోపియన్‌ యూనియన్‌ సెంట్రల్‌ బ్యాంకుai వడ్డీరేట్లు పెంచవచ్చనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. దేశీ స్టాక్‌ మార్కెట్‌ నుంచి పెట్టుబడులు వేగంగా వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో శుక్రవారం ఆరంభం నుంచే మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఉదయం ఆరంభం కావడమే ఆరు వందలకు పైగా పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ జర్నీ మొదలైంది. మరోవైపు   అంతర్జాతీయ మార్కెట్లు సైతం నష్టాల్లోనూ ట్రేడ్‌ అవుతున్నాయి.

శుక్రవారం ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ దాదాపు 600 పాయింట్ల నష్టంతో 54,760 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుండటంతో నష్టాలు తప్పడం లేదు.  ఉదయం 9:50 గంటల సమయంలో 735 పాయింట్లు కోల్పోయి 1.28 శాతం క్షీణించి 54,607 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 212 పాయింట్లు నష్టపోయి 1.29 క్షీణించి 16,265 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. గంట వ్యవధిలోనే రెండు సూచీలు భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చత్త పరిస్థితులకు ఇన్వెస్టర్లు విలవిలాడుతున్నారు.

హెవీ వెయిట్‌ కలిగిన కంపెనీ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. విప్రో, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, కోటక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ఫార్మా కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, మారుతి సుజూకి, టైటాన్‌, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ఉ‍న్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ 1.3 శాతం క్షీణించింది.

మరిన్ని వార్తలు