మార్కెట్‌పై చమురు పిడుగు!

8 Mar, 2022 05:00 IST|Sakshi

ఆజ్యంపోసిన ద్రవ్యోల్బణ భయాలు 

మెటల్‌ మినహా అన్ని షేర్లలో అమ్మకాలే

ఏడు నెలల కనిష్టానికి సూచీలు

సెన్సెక్స్‌ 1,491 పాయింట్లు క్రాష్‌ 

16 వేల దిగువకు నిఫ్టీ 

నాలుగోరోజూ నష్టాలే

ముంబై: అనూహ్యంగా ఎగబాకిన ముడి చమురు ధరలకు ద్రవ్యోల్బణ భయాలు ఆజ్యం పోయడంతో సోమవారం ఈక్విటీ మార్కెట్లు మండిపోయాయి. రష్యా క్రూడ్‌ ఎగుమతులపై ఆంక్షలు విధించాలని పాశ్చత్య దేశాలు యోచిస్తున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఉక్రెయిన్‌కు మద్దతుగా నాటో బలగాలు పోరులోకి దిగుతాయనే వార్తలు వెలుగులోకి రావడంతో ఇకపై యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో అనే భయాలూ వెంటాడాయి. ఇక దేశీయంగా ఫిబ్రవరిలో సేవల రంగం తీరు నిరాశపరిచింది. ఎన్‌ఎస్‌ఈ కుంభకోణంలో చిత్రా రామకృష్ణన్‌ను సీబీఐ ఆదివారం అర్ధరాత్రి  అరెస్ట్‌ చేయడం మార్కెట్‌ వర్గాలు కలవరపడ్డాయి. మరోవైపు ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి జీవితకాల కనిష్టానికి చేరుకోవడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. 

ఈ పరిణామాలన్నీ సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి. ఫలితంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మరో బ్లాక్‌ మండే నమోదైంది. ఒక్క మెటల్‌ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనవడంతో స్టాక్‌ సూచీలు 7 నెలల కనిష్టస్థాయిల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ 1,491 పాయింట్లు నష్టపోయి 52,843 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 382 పాయింట్లను కోల్పోయి 16వేల దిగువున 15,863 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్‌ 1967 పాయింట్లు పతనమై  52,367 వద్ద, నిఫ్టీ 534 పాయింట్లు నష్టపోయి 15,711 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,482 కోట్ల షేర్లను అమ్మేయగా.. దేశీ ఇన్వెస్టర్లు రూ.5,331 కోట్ల షేర్లను కొన్నారు.  
 
ప్రపంచ మార్కెట్లూ పతనమే...  
పదోరోజూ ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు పతనాన్ని చవిచూశాయి. ఆసియాలో అన్ని దేశాల స్టాక్‌ సూచీలు నష్టంతో ముగిశాయి. హాంగ్‌కాంగ్‌ మార్కెట్‌ అత్యధికంగా నాలుగుశాతం క్షీణించింది. జపాన్, తైవాన్, కొరియా సూచీలు మూడు శాతం, చైనా, సింగపూర్, ఇండోనేషియా సూచీలు రెండు శాతం నష్టపోయాయి. యూరప్‌లోని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు మూడు శాతం నష్టంతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. అయితే మిడ్‌సెషన్‌ నుంచి కొనుగోళ్ల మద్దతుతో అరశాతం నష్టాన్ని చవిచూశాయి. కాగా అమెరికా స్టాక్‌ మార్కెట్లు రెండు శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతున్నాయి.   గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్‌ సూచీ 3,404 పాయింట్లు(ఆరుశాతం) క్షీణించడంతో ఇన్వెస్టర్లు రూ.11.28 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.

మరిన్ని వార్తలు