నష్టాలతోనే ముగింపు.. అయితే చివర్లో కాస్త ఊరట

9 May, 2022 16:41 IST|Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం కూడా నష్టాలతోనే మొదలైంది. ద్రవ్యోల్బణ కట్టడికి వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, చల్లారని ఉక్రెయిన్‌ యుద్ధ వేడి, చైనాలో కంట్రోలోకి రాని కరోనాతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. మార్కెట్‌లో పెట్టుబడుల విషయంలో ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. ఫలితంగా గత వారంలో మొదలైన నష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 54,188 పాయింట్లతో భారీ నష్టాలతో మొదలైంది. ఒక దశలో 54 వేల మార్క్‌ను కోల్పోయి 53.918 పాయింట్లకు పడిపోయింది. షేర్లు కనిష్టాల వద్ద లభిస్తుండటంతో ఒక్కసారిగా కొనుగోళ్ల మద్దతు పెరిగింది. దీంతో చివరకు మార్కెట్‌ ముగిసే సమయానికి నష్టాల తీవ్రత తగ్గింది. 364 పాయింట్లు నష్టపోయి 54,470 పాయింట్ల వద్ద ముగిసింది. ఆరంభంతో పోల్చితే మెరుగైన స్థితిలోనే సెన్సెక్స్‌ ముగించింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 109 పాయింట్లు నష్టపోయి 16,301 వద్ద క్లోజయ్యింది. చివర్లో లభించిన కొనుగోళ్ల మద్దతులో సెన్సెక్స్‌ 54 వేలు, నిఫ్టీ 16 వేల మార్క్‌ను నిలబెట్టుకోగలిగాయి.

పవర్‌గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, ఇన్ఫోసిస్‌, మారుతి, బజాజ్‌ ఫిన్‌ సర్వీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, టీసీఎస్‌, సన్‌ఫార్మా షేర్లు లాభపడ్డాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, నెస్టల్‌ ఇండియా, టాటాస్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఎల్‌ఐసీ ఐపీవోలో 2.88 నిష్పత్తిలో సబ్‌స్క్రైబ్‌ అయ్యింది.

మరిన్ని వార్తలు