స్టాక్‌ మార్కెట్‌పై బేర్‌ పంజా.. నేల ముఖం పట్టిన సూచీలు

22 Oct, 2021 15:55 IST|Sakshi

ముంబై: అనూహ్యంగా పెరుగుతూ పోయిన స్టాక్‌ మార్కెట్‌ క్రమంగా దిద్దుబాటు దిశగా పయణిస్తోంది. ఆరంభంలో దేశీ సూచీలు లాభాలు పొందినా.. మధ్యాహ్నం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలు షురూ చేయడంతో తిరిగి నష్టాలతోనే దేశీ స్టాక్‌ మార్కెట్లు ముగిశాయి. చివరి నిమిషంలో బ్యాంకు షేర్లు ఆదుకోవడంతో భారీ నష్టాలు తప్పాయి. హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో షేర్లు లాభాలు పొందగా ఐటీసీ, టాటాస్టీల్‌, ఇన్ఫోసిస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీం‍ద్రా షేర్లు నష​‍్టపోయాయి. 

ఈ రోజు ఉదయం బీఎస్‌సీ సెన్సెక్స్‌ 61,044 పాయింట్లతో మొదలవగా ఆ తర్వాత వరుసగా లాభాలు పొందుతూ ఓ దశలో 61,420 పాయింట్లను తాకింది. దీంతో తిరిగి మార్కెట్‌లో బుల్‌ జోరు మొదలైందనే భావన ఏర్పడింది. కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారింది. లాభాలు స్వీకరించేందుకు ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టడంతో వరుసగా పాయింట్లు కోల్పోతూ 60,627 పాయింట్ల కనిస్టానికి పడిపోయింది. చివరల్లో బ్యాంకు షేర్లు ఆదుకోవడంతో మార్కెట్‌ ముగిసే సమయానికి 102 పాయింట్లు నష్టపోయి 60,821 పాయింట్ల దగ్గర ఆగిపోయింది. మరోవైపు నిఫ్టీ సైతం 63 పాయింట్లు నష్టపోయి 18,144 దగ్గర క్లోజయ్యింది. 

మరిన్ని వార్తలు