నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌.. మరోసారి 60వేల దిగువలో సెన్సెక్స్‌

11 Nov, 2021 15:57 IST|Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ మరోసారి నష్టాల బాట పట్టింది. అక్టోబరు చివరి వారం నుంచి కుదుపులకు లోనవుతున్న మార్కెట్‌లో మరోసారి అదే ట్రెండ్‌ కొనసాగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రెండు సూచీలు భారీగా నష్టాలను చవి చూశాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం మరింతగా పెరగవచ్చనే వార్తల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు లాభాలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. దీంతో దేశీ సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. 

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 60,291 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత ఏ దశలోనూ పైకి వెళ్లలేక పోయింది. ఉదయం నుంచి సాయంత్రం మార్కెట్‌ ముగిసే వరకు పాయింట్లు కోల్పోతూనే ఉంది. చివరకు 433 పాయింట్లు నష్టపోయి 59,919 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 132 పాయింట్లు నష్టపోయి 17,885 దగ్గర క్లోజయ్యింది. మరోసారి నిఫ్టీ, సెన్సెక్స్‌లకు 18 వేలు, 60వేల పాయింట్ల దగ్గర రెసిస్టెన్స్‌ ఎదురైంది.

ఎన్‌ఎస్‌ఈ 50 ఇండెక్స్‌ 0.90 శాతం, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 0.88 శాతం క్షీణత నమోదు చేసింది. ఈ ఒక్క రోజే విదేశీ ఇన్వెస్టర్లు సుమారు 125 మిలియన్‌ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. మార్కెట్‌కు కొద్ది సేపు అండగా నిలబడిన బ్యాంకు, ఐటీ షేర్లు సైతం చివరకు చేతులెత్తేశాయి. దీంతో సూచీలు చివరి నిమిషంలో కూడా కోలుకోలేకపోయాయి.

టాటా స్టీల్‌, టైటాన్‌కంపెనీ, ఎల్‌ అండ్‌ టీ, ఎం అండ్‌ ఎం, మారుతి సుజూకి, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు లాభాలు పొందగా టెక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కోటక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు నష్టాలు చవి చూశాయి.
 

మరిన్ని వార్తలు