రూ.1.25 లక్షల కోట్లు

21 Oct, 2020 04:32 IST|Sakshi

2019లో సైబర్‌ నేరాల వల్ల కలిగిన నష్టం

న్యూఢిల్లీ: సైబర్‌ నేరాల కారణంగా 2019లో రూ.1.25 లక్షల కోట్ల నష్టం ఏర్పడినట్టు ‘నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ’ కోఆర్డినేటర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజేష్‌ పంత్‌ తెలిపారు. స్మార్ట్‌ పట్టణాల అభివృద్ధిని చేపట్టడంతోపాటు 5జీ నెట్‌వర్క్‌ను అమల్లోకి తీసుకురావడం వల్ల భవిష్యత్తులోనూ సైబర్‌ నేరాల ముప్పు పెరిగే అవకాశం ఉందన్నారు. భారత్‌లో కేవలం కొన్ని కంపెనీలే సైబర్‌ భద్రతా ఉత్పత్తులను తయారు చేస్తున్నాయంటూ.. ఈ రంగంలో ఎంతో శూన్యత నెలకొందన్నారు. విశ్వసనీయమైన దేశీయ పరికరాల అభివృద్ధి ద్వారా సైబర్‌ దాడులకు అడ్డుకట్ట వేసేందుకు ఈ రంగానికి సంబంధించి ఒక ఫోరమ్‌ అవసరాన్ని రాజేష్‌ పంత్‌ గుర్తు చేశారు.  

మొబైల్‌ఫోన్లు టార్గెట్‌..  
‘‘మొబైల్‌ ఫోన్ల వంటి పరికరాలకు ఎన్నో ప్రమాదాలున్నాయి. మొబైల్‌ ఫోన్‌పై దాడుల తీరును మేము విశ్లేషించి చూశాము. కేవలం యాప్‌లపైనే కాదు.. 15 రకాల భిన్న మార్గాల్లో దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌), ప్రాసెసర్లు, మెమొరీ చిప్‌లు, కమ్యూనికేషన్‌ ఇంటర్‌ఫేస్, బ్లూటూత్, వైఫై కూడా వీటిల్లో ఉన్నాయి’’ అని రాజేష్‌ పంత్‌ తెలిపారు. ఫోన్లలో ముందుగానే ఇన్‌స్టాల్‌ అయి ఉండే యాప్‌లు చాలా వరకు డేటాను తరలిస్తున్నట్టు చెప్పారు.    

మరిన్ని వార్తలు