Digital Economy: హైదరాబాద్‌లో జోరుమీదున్న బిజినెస్‌ ఇదే!

16 Mar, 2022 12:09 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా డేటా సెంటర్ల పరిశ్రమ చెప్పుకోదగ్గ స్థాయిలో పరిమాణాన్ని పెంచుకోవడంతోపాటు, వృద్ధి కొనసాగనున్నట్లు ఎన్‌ఎక్స్‌ట్రా, జేఎల్‌ఎల్‌ రూపొందించిన నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి నేపథ్యంలోనూ డిజిటల్‌ మౌలిక సదుపాయాలను అందిపుచ్చుకోవడం, డిజిటల్, క్లౌడ్‌ వినియోగం పెరగడం, 5జీ అందుబాటులోకి రానుండటం వంటి అంశాలు ప్రభావం చూపనున్నట్లు ఈ సంయుక్త నివేదిక విశ్లేషించింది.

డేటా సెంటర్ల బిజినెస్‌లో ప్రధానంగా ముంబై, చెన్నైలలో అధిక వృద్ధి నమోదవుతున్నట్లు పేర్కొంది. ఇందుకు అనువైన మౌలికసదుపాయాలు, వ్యూహాత్మక ప్రాంతాలుకావడం, కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్లు సహకరిస్తున్నట్లు తెలియజేసింది. ఇవన్నీ వృద్ధికి దన్నునిస్తున్నట్లు తెలియజేసింది. ‘దేశీయంగా విస్తరిస్తున్న డిజిటల్‌ విప్లవం: డేటా సెంటర్లు’ పేరుతో రూపొందించిన నివేదికలోని ఇతర వివరాలు ఇలా..  

తీరప్రాంత పట్టణాలు 
దేశీయంగా కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్లు అందుబాటులో ఉండటంతో డేటా సెంటర్ల భవిష్యత్‌ ప్రధానంగా తీరప్రాంత(కోస్టల్‌) పట్టణాలపై ఆధారపడి ఉంది. అయితే ఢిల్లీ–ఎన్‌సీఆర్, హైదరాబాద్, బెంగళూరు, పుణే వంటి ల్యాండ్‌లాక్‌డ్‌ పట్టణాలు సైతం పరిశ్రమ వృద్ధితో లబ్ది పొందనున్నాయి. డేటా రక్షణ, క్లౌడ్‌ సంస్థల నుంచి భారీ డిమాండ్, క్యాప్టివ్‌ నుంచి క్లౌడ్‌కు మార్పు, డిజిటల్‌వైపు ప్రభుత్వ చర్యలు, పెట్టుబడుల వంటి పలు అంశాలు డేటా సెంటర్ల పరిశ్రమకు జోష్‌నిస్తున్నాయి. నివేదికను భారతీ ఎయిర్‌టెల్‌ అనుబంధ డేటా సెంటర్ల సంస్థ ఎన్‌ఎక్స్‌ట్రా, రియల్టీ కన్సల్టెన్సీ, ప్రొఫెషనల్‌ సర్వీ సుల కంపెనీ జేఎల్‌ఎల్‌ ఇండియా సంయుక్తంగా రూపొందించాయి.

చదవండి: రూ.322 కోట్లు డీల్‌, ‌టెక్‌ మహీంద్రా చేతికి మరో కంపెనీ! 

మరిన్ని వార్తలు