డీబీఎస్‌కు అప్పట్లోనే వాటాలు..!

21 Nov, 2020 06:03 IST|Sakshi

కానీ రిజర్వ్‌ బ్యాంకే ఒప్పుకోలేదు

ఎల్‌వీబీ ప్రమోటరు ప్రదీప్‌ వెల్లడి

ముంబై: ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోయిన లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌లో (ఎల్‌వీబీ) 50 శాతం వాటాలు కొనేందుకు సింగపూర్‌కి చెందిన డీబీఎస్‌ 2018లోనే ప్రయత్నించింది. కానీ రిజర్వ్‌ బ్యాంక్‌ అప్పట్లో ఈ డీల్‌ని తిరస్కరించింది. ఎల్‌వీబీలో అత్యధిక వాటాలు గల (4.8 శాతం) ఏకైక ప్రమోటర్‌ అయిన కేఆర్‌ ప్రదీప్‌ ఈ విషయాలు వెల్లడించారు. ‘2018లో మూలధన సమీకరణ ప్రణాళికల్లో భాగంగా ఇన్వెస్టర్లను అన్వేషించేందుకు జేపీ మోర్గాన్‌ సంస్థను ఎల్‌వీబీ నియమించుకుంది.

ఈ క్రమంలో షేరు ఒక్కింటికి రూ. 100–155 శ్రేణిలో ఆఫర్లు వచ్చాయి. షేరుకి రూ. 100 చొప్పున కనీసం 50% వాటా తీసుకునేందుకు డీబీఎస్‌ ముందుకొచ్చింది. అయితే, ఆ సంస్థ ఎల్‌వీబీపై నియంత్రణాధికారాలు కావాలని కోరుకుంది. కానీ ఆర్‌బీఐ పెట్టిన నిబంధనలతో వెనక్కి తగ్గింది‘ అని చెప్పారు. ఒకవేళ అప్పుడే గ్రీన్‌ సిగ్నల్‌ లభించి ఉంటే డీబీఎస్‌ షేరుకి రూ. 100 ఇచ్చేదని, ఇప్పుడైతే పూర్తి ఉచితంగానే తీసుకున్నట్లవుతుందని ప్రదీప్‌ పేర్కొన్నారు.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఇప్పటికైనా షేర్‌హోల్డర్లు, ప్రమోటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందని, వారిని ఉత్తి చేతులతో పోనివ్వదని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్‌వీబీ బోర్డును రద్దు చేసిన ఆర్‌బీఐ.. దాన్ని డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియాలో విలీనం చేసే ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ప్రదీప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  ఎల్‌వీబీలో ప్రదీప్‌తో పాటు మరో ముగ్గురు ప్రమోటర్ల కుటుంబాలకు (ఎన్‌ రామామృతం, ఎన్‌టీ షా, ఎస్‌బీ ప్రభాకరన్‌) 2% వాటాలు ఉన్నాయి. మొత్తం మీద ప్రమోటర్లకు 6.8% వాటా ఉండగా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ నేతృత్వంలోని సంస్థాగత ఇన్వెస్టర్లకు 20% వాటాలు ఉన్నాయి. రిటైల్‌ షేర్‌హోల్డర్లకు ఎల్‌వీబీలో మొత్తం 45 శాతం వాటాలు ఉన్నాయి. లక్ష్మీ విలాస్‌ బ్యాంకును డీబీఎస్‌లో విలీనం చేసిన పక్షంలో వీటికి విలువ లేకుండా పోతుందనేది షేర్‌హోల్డర్ల ఆందోళన  
శుక్రవారం బీఎస్‌ఈలో ఎల్‌వీబీ షేరు 10 శాతం క్షీణించి రూ. 9 వద్ద క్లోజయ్యింది.    

మరిన్ని వార్తలు