క్రిప్టో కరెన్సీలపై సంప్రదింపుల పత్రం!

31 May, 2022 06:43 IST|Sakshi

త్వరలోనే ఖరారు చేస్తాం

అంతర్జాతీయంగా ఏకాభిప్రాయంతోనే విజయం

కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సేత్‌

న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై వివిధ భాగస్వాములు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ తదితర సంస్థల అభిప్రాయాలతో సంప్రదింపుల పత్రాన్ని త్వరలోనే ఖరారు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేత్‌ వెల్లడించారు. వర్చువల్‌ (ఆన్‌లైన్‌)గా చేతులు మారే క్రిప్టో కరెన్సీల నియంత్రణలో సవాళ్ల పరిష్కారానికి అంతర్జాతీయ స్పందన అవసరమన్నారు. క్రిప్టో కరెన్సీలు స్థూల ఆర్థిక స్థిరత్వానికి ముప్పు అని, దేశీయంగా నియంత్రించలేని పరిస్థితుల్లో వీటిని అనుమతించొద్దంటూ ఆర్‌బీఐ కేంద్రానికి తన అభిప్రాయాలను స్పష్టం చేయడం తెలిసిందే.

అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించే ‘ఐకానిక్‌ వీక్‌’ కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమం సందర్భంగా సేత్‌ మాట్లాడారు. ‘‘దేశీయ భాగస్వాములు, సంస్థలతోపాటు, ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి అంతర్జాతీయ సంస్థల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నాం. దీంతో అతి త్వరలోనే సంప్రదింపుల పత్రం సిద్ధం కానుంది’’అని తెలిపారు. కొన్ని దేశాలు క్రిప్టో కరెన్సీలను నిషేధించిన అంశాన్ని సేత్‌ ప్రస్తావిస్తూ.. అంతర్జాతీయ ఏకాభిప్రాయం లేకుండా ఈ విషయంలో అవి విజయం సాధించలేవన్నారు. ‘‘డిజిటల్‌ ఆస్తులను డీల్‌ చేసే విషయంలో విస్తృతమైన కార్యాచరణ అవసరం. ఈ విషయంలో అన్ని ఆర్థిక వ్యవస్థలు కలసికట్టుగా నడవాలి. ఏ దేశం కూడా ఏదో ఒక వైపున ఉండడాన్ని ఎంపిక చేసుకోకూడదు. క్రిప్టోల నియంత్రణలపై అంతర్జాతీయంగా ఏకాభిప్రాయం అవసరం’’అని సేత్‌ వివరించారు.

వేగవంతమైన వృద్ధి దిశగా ప్రయాణం
అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తుందన్న ఆశాభావాన్ని సేత్‌ వ్యక్తం చేశారు. ప్రస్తుత సవాళ్లే కాకుండా, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సైతం అధిగమిస్తామని చెప్పారు. ద్రవ్య, మానిటరీ పరమైన చర్యలతో ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందన్నారు.

బ్యాంకుల ప్రైవేటీకరణపై కొనసాగుతున్న కసరత్తు
రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించే విషయంలో ముందస్తు చర్యలు కొనసాగుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా తెలిపారు. కనీసం రెండు పీఎస్‌బీలను ప్రైవేటీకరించనున్నట్టు 2021–22 బడ్జెట్‌లోనే కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రతిపాదన చేయడం గమనార్హం. బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించి నివేదిక పార్లమెంటు ముందున్నట్టు మల్హోత్రా గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు