డెట్‌లో నమ్మకమైన రాబడి

26 Sep, 2022 10:57 IST|Sakshi

స్వల్ప కాల లక్ష్యాలకు డెట్‌ సాధనాలే అనుకూలం. ఈక్విటీలంటే కనీసం ఐదేళ్లు అంతకుమించి వ్యవధి కావాల్సి ఉంటుంది. రిస్క్‌ తీసుకోలేని వారి కోసం, స్వల్పకాల లక్ష్యాల కోసం డెట్‌ ఫండ్స్‌లో.. తక్కువ రిస్క్, మెరుగైన రాబడుల కోసం చూసే వారికి మనీ మార్కెట్‌ ఫండ్స్‌ అనుకూలమని చెప్పుకోవచ్చు. 2018–20 మధ్యకాలంలో డెట్‌ మార్కెట్లో రుణ చెల్లింపుల ఎగవేతలు, సంక్షోభ సమయంలోనూ మనీ మార్కెట్‌ ఫండ్స్‌ విభాగం బలంగా నిలబడింది.  

పెట్టుబడుల విధానం..  
ఇవి తక్కువ కాల వ్యవధి కలిగిన సాధనాల్లో (సాధారణంగా ఏడాదిలోపు) ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. కనుక క్రెడిట్‌ రిస్క్‌ భయం అక్కర్లేదు. వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో దీర్ఘకాలిక డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం సరికాదు. అందుకని ప్రస్తుత తరుణంలో ఈ పథకాలు ఎంతో అనుకూలమని చెప్పుకోవచ్చు. తక్కువ రిస్క్‌ కోరుకునే వారికి కూడా అనుకూలం. ఈ విభాగంలో ఇన్వెస్టర్లు ప్రధానంగా నాలుగు పథకాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. అవి.. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ (ఏబీఎస్‌ఎల్‌) మనీ మేనేజర్, హెచ్‌డీఎఫ్‌సీ మనీ మార్కెట్, ఎస్‌బీఐ సేవింగ్స్, నిప్పన్‌ ఇండియా మనీ మార్కెట్‌. స్వల్పకాలం నుంచి మధ్య కాలానికి వీటిని పరిశీలించొచ్చు. ఈ పథకాలన్నీ కూడా కనీసం రూ.10వేల కోట్లకు పైగా నిర్వహణ ఆస్తులు కలిగి ఉన్నవి కావడం గమనించాలి.  

రాబడులు  
మనీ మార్కెట్‌ ఫండ్స్‌ మూడేళ్లకు పైన పన్ను అనంతరం రాబడుల్లో బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే మెరుగైన పనితీరు చూపించాయి. డెట్‌ పథకాల్లో కనీసం మూడేళ్లపాటు పెట్టుబడులు కొనసాగించినట్టయితే, లాభాలు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తాయి. మూడేళ్ల రోలింగ్‌ రాబడులను గమనిస్తే ఈ మూడు పథకాల్లోనూ వార్షికంగా 7.5 శాతానికి పైనే ఉన్నాయి. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో ఇవి మనీ మార్కెట్‌ ఫండ్స్‌ విభాగంలో రాబడుల పరంగా మెరుగైన స్థానంలో నిలిచాయి. మూడేళ్లలో సగటున రోలింగ్‌ రాబడి 7.5–7.8 శాతం చొప్పున ఉంది. ఈ కాలంలో గరిష్ట రాబడి 8.9–9.5 శాతం వరకు ఉంటే, కనిష్ట రాబడి 5–5.2 శాతం మధ్య ఉంది.

ఒక్క 2021 సంవత్సరాన్ని మినహాయిస్తే గడిచిన పదేళ్ల కాలంలో ఈ పథకాల్లో రాబడి 6.29–9.2 శాతం మధ్య ఉంది. కానీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో రేట్లు 6–7 శాతంగానే ఉండడాన్ని గమనించాలి. మూడేళ్లకు మించిన కాలానికి వచ్చే రాబడిపై 20 శాతం పన్ను పడుతుంది. కాకపోతే రాబడి నుంచి ద్రవ్యోల్బణాన్ని మినహాయించుకోవచ్చు. ఇండెక్సేషన్‌ ప్రయోజనం వల్ల రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడకపోవచ్చు. కనుక మూడేళ్లు, ఐదేళ్ల పాటు పెట్టుబడులపై ఈ పథకాల్లో పన్ను అనంతరం నికర వార్షిక రాబడి 7 శాతానికి పైనే, అది కూడా రిస్క్‌ లేకుండా ఉంటుందని అంచనా వేసుకోవచ్చు.  

పోర్ట్‌ఫోలియో 
ఈ నాలుగు పథకాలూ తక్కువ రిస్క్‌ పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నాయి. వీటి పెట్టుబడి సాధనాల సగటు మెచ్యూరిటీ (కాల వ్యవధి ముగియడం) 0.28–0.38 సంవత్సరాలుగా ఉంది. అంటే ఏడాదిలో ఒకటో వంతు. 71–113 వరకు సెక్యూరిటీ సాధనాల్లో పెట్టుబడులు కలిగి ఉన్నాయి. ఒక సాధనంలో 5 శాతానికి మించి పెట్టుబడులు లేవు. వైవిధ్యం ఎక్కువగా కనిపిస్తోంది. 

చదవండి: ఒకటికి మించి బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్‌!

మరిన్ని వార్తలు