Deccan Aviations: రూపాయికే విమానం ఎక్కించిన గోపినాథ్‌ ఏమంటున్నారు

23 Aug, 2021 14:49 IST|Sakshi

Deccan Aviations GR Gopinath దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌ అన్నారు గురజాడ. ఆ మాటల స్ఫూర్తికి వాస్తవ రూపం ఇచ్చినవారిలో జీఆర్‌ గోపినాథ్‌ ఒకరు. విమాన ప్రయాణం చేసే హక్కు సంపన్నులకే కాదు. ఈ దేశంలో ఉన్న సామాన్యులకు కూడా ఉందని చాటి చెప్పారు. ఒక్క రూపాయికే ఆకాశయానం కలిగించిన గొప్ప ఎంట్రప్యూనర్‌ గోపినాథ్‌.

ఆకాశం నీ హద్దురా
డైనమిక్‌ ఎంట్రప్యూనర్‌,  సోషల్‌ రీఫార్మర్‌, దేశభక్తుడైన గోపినాథ్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఆకాశం నీ హద్దురా అనే సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా అందరూ చూసే ఉంటారు. అయితే ఇప్పుడా గోపినాథ్‌ ఏం చేస్తున్నారు. తన దక్కన్‌ ఏవియేషన్‌ సంస్థ గురించి ఏం చెప్పారు. ఈ దేశ భవిష్యత్తు గురించి ఆయన కంటున్న కలలు ఏంటీ ? ఇటీవల మనీ కంట్రోల్‌ మీడియాకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్య అంశాలు మీ కోసం..

మిస్‌ అవుతున్నా
దక్కన్‌ ఏవియేషన్స్‌ సీఈఓగా ఉన్నప్పుడు సామాన్యులను విమానంలోకి ఎక్కించడం, టైర్‌ టూ సిటీల మద్య ఎయిర్‌ కనెక్టివిటీ కల్పించడం వంటి పనులు చేపట్టినప్పుడు ఒంట్లో కొత్త శక్తి ప్రవహించేది. ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఇప్పుడది మిస్‌ అవుతున్నాను.
 


ఆ తప్పు చేయను
పునర్జన్మలపై నాకు నమ్మకం లేదు, కానీ మళ్లీ జన్మంటూ ఉంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నా డెక​‍్కన్‌ ఏవియేషన్‌ను విజయ్‌మాల్యాకు అమ్మను గాక అమ్మను. డెక్కన్‌ ఏవియేషన్‌ని అమ్మేయాలని నిర్ణయం తీసుకోవడం పొరపాటు. నేను నా మనసు మాట విని ఉండాల్సింది. కానీ అలా చేయకుండా డెక్కన్‌ ఏవియేషన్‌లో పెట్టుబడిదారుల అభిప్రాయం వైపుకే మొగ్గు చూపాను. డెక్కన్‌ ఏవియేషన్‌ని అమ్మేయడం వల్ల మాకు లాభాలు వచ్చాయనే మాట నిజమే. కానీ సామాన్యులకు విమానయానం దగ్గర చేయాలనే నా కల. కానీ అలా జరగలేదు. అయితే జరిగినదాని గురించి జరగబోయేదాని గురించి నాకు పెద్దగా బాధ అయితే లేదు. 


రాజకీయాల్లో...
కింగ్‌ఫిషర్‌ ఓనర్‌ విజయ్‌ మాల్యాకు ఎయిర్‌ దక్కన్‌ని అమ్మేసిన తర్వాత ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో బెంగళూరు సౌత్‌ నియోకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాను. అయినా సరే నా ప్రయాణం అపకుండా అవినీతి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఉద్యమంలో ఉధృతంగా పాల్గొన్నాను. ఆప్‌ పార్టీ పెట్టగానే దానిలో చేరాను. అయితే ఆ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ నియంత్రృత్వ పోకడలు నచ్చక ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చేశాను. కానీ పార్టీ పెట్టిన తీరు, ఎన్నికల్లో గెలిపించిన వైనం, పరిపాలన చేస్తున్న విధానాల పరంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ అంటే ఇప్పటికీ అభిమానం, గౌరవం ఉన్నాయి. రాజకీయాల్లో నూతన అధ్యాయాన్ని అరవింద్‌ కేజ్రీవాల్‌ ధైర్యంగా ప్రారంభించారనే నమ్ముతాను.

అలాంటి నేతలు కావాలి
బడా కార్పోరేట్‌ కంపెనీలు అన్ని కూడా పాలసీ తయారీలో కీలకంగా ఉండే వారితో దగ్గరి సంబంధాలు నెరుపుతున్నాయి. కార్పోరేట్‌ శక్తులకు మంచి నాయకులు కాదు మనకు కావాల్సింది. సామాజికంగా విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చే సృజనాత్మక ఐడియాలు కలిగిన ఎంట్రప్యూనర్లు ప్రోత్సహించేవారు కావాలి. అప్పుడే మన సమాజం వేగంగా మార్పులు వస్తాయి. అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయి.

వారిపైనే ఆశలు
ఇప్పుడున్న ఎంట్రప్యూనర్లలో ఓలా భవీష్‌ అగర్వాల్‌, పేటీఎం విజయ్‌ శేఖర్‌ శర్మలు ఎక్కువగా నన్ను ఆకట్టుకున్నారు. ఇలా వ్యక్తులు మనకు వేలమంది కావాలి. వారంత విభిన్న రంగాల్లోకి చొచ్చుకుపోవాలి. తమకున్న ఐడియాలను ఆచరణలోకి తెచ్చి దేశ గతిని మార్చేయాలి. నా దృష్టిలో ఈ రోజుల్లో ఫ్రీడం ఫైటర్లు అంటే ఎంట్రప్యూనర్లే. వారే ఈ దేశ భవిష్యత్తును నిర్మించగలరు.

అలా జరగడం లేదు
నరేంద్రమోదీ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టగానే రెడ్‌టేపిజంలో మార్పులు వస్తాయని ఆశించాను. కానీ అలా ఏం జరగడం లేదు. రెట్రోట్యాక్స్‌ను రద్దు చేయడానికే ఏడేళ్లు సమయం తీసుకున్నారు. కొత్త ఎంట్రప్యూనర్లకు క్షేత్రస్థాయిలో అనవసరంగా ఎదురయ్యే అడ్డంకులు తొలగించాలి. ఐడియాలో సాధ్యమైనంత త్వరగా ఆచరణలోకి వచ్చే వెసులుబాటు ప్రభుత్వ పరంగా ఉండాలి. అప్పుడే మనం చైనాను దాటి అభివృద్ధిలో ముందుకు పోగలం.

రిటైర్‌ అయ్యాక
రిటైర్మెంట్‌ అంటూ ఏమీ లేదు. దక్కన్‌ ఏవియేషన్స్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బిజిగానే ఉంటున్నాను. కర్నాటకలోని మా సొంతూరిలో వ్యవసాయం క్షేత్రంలో ఎక్కువ సేపు గడుపుతుంటా. దీంతోపాటు డెక్కన్‌ ఛార్టర్స్‌ అనే సంస్థకు గౌరవ అధ్యక్షుడిగా హోదాలో ఉన్నాను. ఈ సంస్థ ఆధీనంలో యాభై వరకు హెలికాప్టర్లు, జెట్‌ విమానాలు ఉన్నాయి. వీటి నిర్వాహణకు సంబంధించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను. ఇక రాజకీయాలు, భారత ఆర్థిక వ్యవస్థ, అవినీతి తదితర అంశాలపై గంటల తరబడి జరిగే చర్చాగోష్టీల్లో భాగమవుతాను. వర్తమాన అంశాలపై పుస్తకాలు కూడా రాస్తుంటాను. ఇప్పటికే సింపుల్‌ ఫ్లై, వన్‌ కనాట్‌ మిస్‌ ద ఫ్లైట్‌ అనే పుస్తకాలు అచ్చయ్యాయి.

- సాక్షి , వెబ్‌డెస్క్‌

చదవండి: స్త్రీలు ఎగరేసిన విమానం

మరిన్ని వార్తలు