2024 ఆఖరు నాటికి పూర్తి స్థాయిలో పసిడి ఉత్పత్తి

9 Oct, 2023 06:28 IST|Sakshi

జొన్నగిరి ప్రాజెక్టుపై డీజీఎంఎల్‌ ఎండీ ప్రసాద్‌ వెల్లడి

న్యూఢిల్లీ: జొన్నగిరి బంగారు గనుల్లో వచ్చే ఏడాది అక్టోబర్‌–డిసెంబర్‌ నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కాగలదని డెక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌ (డీజీఎంఎల్‌) ఎండీ హనుమ ప్రసాద్‌ తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే  ఏటా 750 కిలోల బంగారం వెలికి తీయొచ్చని ప్రసాద్‌ తెలిపారు. ఇప్పటివరకు దీనిపై రూ. 200 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా పైలట్‌ ప్రాతిపదికన ప్రస్తుతం నెలకు ఒక కేజీ మేర బంగారాన్ని మైనింగ్‌ చేస్తున్నారు.

2013లో తమకు గనిని కేటాయించగా, ప్రాజెక్టు మదింపును పూర్తి చేసేందుకు 8–10 ఏళ్లు పట్టినట్లు ప్రసాద్‌ చెప్పారు. అటు కిర్గిజ్‌స్తాన్‌లో తమకు 60 శాతం వాటాలున్న మరో బంగారు గనిలో కూడా 2024 అక్టోబర్‌–నవంబర్‌లో ఉత్పత్తి ప్రారంభం కాగలదని ఆయన పేర్కొన్నారు. ఆల్టిన్‌ టోర్‌ గోల్డ్‌ ప్రాజెక్టు నుంచి ఏటా 400 కేజీల బంగారం వెలికితీయొచ్చని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో జొన్నగిరి బంగారు గని ఉంది. బీఎస్‌ఈలో లిస్టయిన ఏకైక గోల్డ్‌ మైనింగ్‌ కంపెనీ డీజీఎంఎల్‌. జొన్నగిరి ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్న జియోమైసూర్‌ సరీ్వసెస్‌ ఇండియాలో డీజీఎంఎల్‌కు మెజారిటీ (40 శాతం) వాటాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు