తగ్గిన పరిశ్రమల జోరు.. ఆహార ధరల తగ్గుముఖం

13 Feb, 2024 07:53 IST|Sakshi

డిసెంబర్‌లో ఉత్పత్తి వృద్ధి 3.8 శాతానికి పరిమితం

మైనింగ్, విద్యుత్, క్యాపిటల్‌ గూడ్స్‌ పేలవం

ఆహార ధరల ఊరట  

న్యూఢిల్లీ: భారత్‌ మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 25 శాతంపైగా వెయిటేజ్‌ ఉన్న  పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 2023 డిసెంబర్‌లో మందగించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 3.8 శాతంగా నమోదయ్యింది. 2022 ఇదే నెలలో ఈ రంగం వృద్ధి స్పీడ్‌ 5.1 శాతం. సమీక్షా కాలంలో మైనింగ్, విద్యుత్‌ ఉత్పత్తి విభాగాలు పేలవ పనితీరును ప్రదర్శించాయి. అయితే 2023 నవంబర్‌తో (2.4 శాతం) డిసెంబర్‌లో సూచీ పెరగడం (3.8 శాతానికి) కొంత ఊరటనిచ్చే అంశం. ఇక జనవరి వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.1%గా నమోదైంది. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి.

కీలక రంగాలు ఇలా... 

  • జాతీయ గణాంకాల కార్యాలయం గణాంకాల ప్రకారం  మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 70 శాతం వెయిటేజ్‌ ఉన్న తయారీ రంగం వృద్ధి రేటు 3.6 శాతం (2022 డిసెంబర్‌) నుంచి 3.9 శాతానికి (2023 డిసెంబర్‌) పెరిగింది.
  • విద్యుత్‌ ఉత్పత్తి వృద్ధి 10.4 శాతం నుంచి 1.2 శాతానికి పడిపోయింది. 
  • మైనింగ్‌ క్షీణతలోనే ఉంది. అయితే క్షీణ రేటు 10.1 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గింది. 

తొమ్మిది నెలల కాలంలో అప్‌
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల (ఏప్రిల్‌–డిసెంబర్‌)  కాలాన్ని చూస్తే.. మాత్రం ఐఐపీ వృద్ధి రేటు 5.5% నుంచి 6.1%కి పెరిగింది.

ఆహార ధరల తగ్గుముఖం
ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన ఆహార ద్రవ్యోల్బణం జనవరిలో 3 నెలల కనిష్ట స్థాయిలో 5.1 శాతానికి తగ్గింది. కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం దీనికి కారణమని అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. ఆహార ఉత్పత్తుల బాస్కెట్‌ను చూస్తే, డిసెంబర్‌లో ధరల భారం 9.53 శాతం పెరగ్గా, ఈ భారం జనవరిలో 8.3 శాతానికి తగ్గింది. ఆహారం, పానీయాల విభాగంలో 7.58%, హౌసింగ్‌ రంగంలో 3.20% ద్రవ్యోల్బణం నమోదైంది.

whatsapp channel

మరిన్ని వార్తలు