దిగుమతులపై నిషేధం- డిఫెన్స్‌ షేర్ల హవా

10 Aug, 2020 14:54 IST|Sakshi

10 శాతం జంప్‌చేసిన హెచ్‌ఏఎల్‌, డైనమాటిక్‌ 

9-4 శాతం మధ్య పలు కౌంటర్లు అప్‌

జాబితాలో బీఈఎల్‌, భారత్‌ ఫోర్జ్‌, మిధానీ

5 శాతం జంప్‌చేసిన ఎల్‌అండ్‌టీ, వాల్‌చంద్‌నగర్‌

ప్రధాని మోడీ ఆత్మనిర్భర్ ప్రణాళికలకు ప్రాధాన్యమిస్తూ కేంద్ర రక్షణ శాఖ వివిధ డిఫెన్స్‌ పరికరాల దిగుమతులపై దృష్టి పెట్టింది. తద్వారా 101 ప్రొడక్టుల దిగుమతులపై నిషేధానికి తెరతీసింది. 2020 ముసాయిదా విధానం కింద వారాంతాన  101 ప్రొడక్టులతో కూడిన జాబితాను రూపొందించింది. ఆయుధాలు, విభిన్న పరికరాలు తదితర 101 ప్రొడక్టులపై రక్షణ శాఖ దశలవారీగా నిషేధాన్ని విధించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే  వీటిలో చాల ప్రొడక్టులను దేశీయంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.  2020-2024 మధ్యకాలంలో దశలవారీగా పలు ప్రొడక్టుల దిగుమతులను నిషేధించే యోచనలో ప్రభుత్వమున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో దేశీ కంపెనీలు సొంత డిజైన్‌, తయారీ సామర్థ్యాలకు మరింత పదును పెట్టుకునే వీలు చిక్కనున్నట్లు వివరించాయి. కాగా.. దేశీయంగా రక్షణ రంగ పరికరాలు, ఆయుధాల తయారీకి వీలుగా రానున్న 6-7ఏళ్లలో రూ. 4 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులకు అవకాశమున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు భావిస్తున్నారు. తద్వారా దేశీయంగా తయారీ రంగానికి భారీగా ప్రోత్సాహం లభించనున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ రంగ సంబంధిత కంపెనీల షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు కౌంటర్లు భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

హెచ్‌ఏఎల్‌ దూకుడు
రక్షణ రంగ పరికరాల దిగుమతులపై నిషేధ వార్తలతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ షేరు 11.5 శాతం దూసుకెళ్లి రూ. 1058ను తాకింది. డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ 5.2 శాతం పెరిగి రూ. 963 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో డైనమాటిక్‌ టెక్నాలజీస్‌ 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ తాకి రూ. 596 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇదేవిధంగా వాల్‌చంద్‌నగర్‌ ఇండస్ట్రీస్‌ 5 శాతం ఎగసి రూ. 55 వద్ద ఫ్రీజయ్యింది. ఇతర కౌంటర్లలో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ దాదాపు 9 శాతం దూసుకెళ్లి రూ. 108 వద్ద ట్రేడవుతోంది. భారత్‌ ఫోర్జ్‌ దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 423ను తాకగా.. మిశ్రధాతు నిగమ్‌(మిధానీ) 4 శాతం పెరిగి రూ. 213కు చేరింది. ఇక ఆస్ట్రా మైక్రోవేవ్‌ 5 శాతం జంప్‌చేసి రూ. 114 వద్ద, భారత్‌ డైనమిక్స్‌ 5.2 శాతం పురోగమించి రూ. 441 వద్ద ట్రేడవుతున్నాయి.   

మరిన్ని వార్తలు