Defence stocks rally: డిఫెన్స్‌ షేర్లు లాభాల గన్స్‌

26 Oct, 2022 03:55 IST|Sakshi

దేశీ తయారీ అండతో లాభార్జనకు ప్లస్‌

ఎగుమతి అవకాశాలతో కొనుగోళ్ల జోరు

కొద్ది రోజులుగా పలు కౌంటర్లకు డిమాండ్‌

న్యూఢిల్లీ: రక్షణ రంగ పరికరాలు, సాంకేతిక సేవలందిచే కంపెనీలు కొద్ది రోజులుగా దేశీస్టాక్‌ మార్కెట్లలో వెలుగులో నిలుస్తున్నాయి. డిఫెన్స్‌ సంబంధ షేర్లకు ఇటీవల డిమాండు బలపడుతున్నట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా రక్షణ రంగ పరికరాలు, ప్రొడక్టుల తయారీకి ప్రభుత్వ ప్రోత్సాహం, భారీ ఎగుమతి అవకాశాలు వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నట్లు తెలియజేశారు. ప్రధాని మోడీ తాజాగా 101 వస్తువులతో జాబితాను విడుదల చేసిన నేపథ్యంలో డిఫెన్స్‌ కౌంటర్లకు జోష్‌ వచ్చినట్లు తెలియజేశారు. దీంతో గత వారం డిఫెన్స్‌ సంబంధ కంపెనీల షేర్లు జోరు చూపాయి. 

జాబితా పెద్దదే
గత వారం లాభాల బాటలో సాగిన డిఫెన్స్‌ సంబంధ షేర్లలో మజ్గావ్‌ డాక్‌యార్డ్, భారత్‌ డైనమిక్స్, కొచిన్‌ షిప్‌యార్డ్, మిశ్రధాతు నిగమ్, భారత్‌ ఎలక్ట్రానిక్స్, భారత్‌ ఫోర్జ్, ఆస్ట్రా మైక్రోవేవ్, పరస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ తదితరాలున్నాయి. ఇకపైన కూడా డిఫెన్స్‌ కౌంటర్లు ఇన్వెస్టర్ల కు లాభాలనిచ్చే వీలున్నట్లు స్టాక్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ రంగంలోని ఇతర కౌంటర్లలో డేటా ప్యాటర్న్స్‌(ఇండియా), హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేశారు. మూడు నెలలుగా ఈ రంగం వెలుగులో నిలుస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జాసానీ వెల్లడించారు.  

కారణాలున్నాయ్‌..  
ప్రభుత్వం నుంచి భారీ ఆర్డర్లకు వీలుండటం, దేశీయంగా తయారీకి ఊతం, పలు దేశాలకు ఎగుమతి అవకాశాలు వంటి అంశాలు డిఫెన్స్‌ కంపెనీల ఆదాయ వృద్ధికి అద్దం పడుతున్నట్లు వివరించారు. అయితే ఇటీవల పలు కౌంటర్లు ర్యాలీ బాటలో సాగడంతో కొంతమేర దిద్దుబాటుకు చాన్స్‌ ఉన్నట్లు అంచనా వేశారు. ఇది కన్సాలిడేషన్‌కు దారి చూపవచ్చని అభిప్రాయపడ్డారు. కొంతకాలంగా టాటా గ్రూప్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఎల్‌అండ్‌టీ తదితర దిగ్గజాలు సైతం డిఫెన్స్‌ తయారీకి ప్రాధాన్యం ఇస్తుండటం ఈ సందర్భంగా ప్రస్తావించదగ్గ అంశంకాగా.. ఏడాది కాలంగా డిఫెన్స్‌ సంబంధ కంపెనీలకు డిమాండు కొనసాగుతున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ గౌరంగ్‌ షా తెలియజేశారు. భవిష్యత్‌లో బీఈఎల్, హెచ్‌ఏఎల్, భారత్‌ డైనమిక్స్, మజ్గావ్‌ డాక్, కొచిన్‌ షిప్‌యార్డ్‌ తదితరాలు భారీ ఆర్డర్లను పొందే వీలున్నట్లు అంచనా వేశారు.  

దిగుమతి ప్రత్యామ్నాయం
అభివృద్ధి చెందిన దేశాలపై రక్షణ రంగ పరికరాల కోసం ఆధారపడటం ఇటీవల తగ్గుతూ వస్తున్నట్లు ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ రీసెర్చ్‌ విశ్లేషకులు అశ్విన్‌ పాటిల్‌ పేర్కొన్నారు. దేశీ తయారీకి రక్షణ శాఖ ఆత్మనిర్భరత పేరుతో ఇస్తున్న దన్ను ఇందుకు సహకరిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో రక్షణ శాఖకు సులభంగా, చౌకగా పరికరాలు అందుబాటులోకి వచ్చే వీలుంటుందని వివరించారు. దేశీ తయారీకి ఊతమిస్తూ 2020 ఆగస్ట్‌ నుంచీ ప్రభుత్వం నాలుగు దఫాలలో 310 ఐటమ్స్‌తో విడుదల చేసిన జాబితా డిఫెన్స్‌ రంగానికి బలిమినిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు