టాటా మోటార్స్‌కు భారీ షాక్‌

2 Mar, 2021 12:51 IST|Sakshi

టాటా  నెక్సాన్‌ ఈవీకి షాకిచ్చిన ఆప్‌ సర్కార్‌

 రాయితీ  తొలగింపు

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల సంస్థ టాటా మోటార్స్‌కు ఢిల్లీ ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది.  నెక్సాన్ పేరుతో అమ్ముతున్న టాటా విద్యుత్ కార్లు ప్రమాణాలకు అనుగుణంగా లేవని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్దారించింది. ఈ మేరకు టాటా నెక్సాన్ కారు ఎలక్ట్రిక్ వెర్షన్‌ వాహనాలను రాయితీ లిస్ట్ నుంచి తొలగిస్తూ ఢిల్లీ రవాణా శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది.  ఫలితంగా ఈ కార్ల కొనుగోలు చేసే కస్టమర్లకు ఎలాంటి సబ్సిడీ రాదు.  దీంతో విద్యుత్ కార్ల విభాగంలో  దేశీయ మార్కెట్లో  టాప్‌లో  దూసుకెడుతున్న టాటా కంపెనీకి  భారీ ఎదురు దెబ్బ తగిలింది.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికిల్ సబ్ స్టాండర్డ్ గా ఉందని.. ఆఫర్ చేసిన డ్రైవింగ్ రేంజ్ అందుకోవడం లేదని ఢిల్లీ  రవాణా మంత్రి  కైలాష్‌ గెహ్లాత్ ప్రకటించారు. మోడల్ ఒకే ఛార్జీపై నిర్దేశించిన పరిధిని చేరుకోవడంలో విఫలమైందని, ఈ నేపథ్యంలో దీనిపై తుది నివేదిక వచ్చేవరకు వాహనాలపై ఇస్తున్న రాయితీని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తమ ప్రభుత్వం విద్యుత్తు కార్లను ప్రోత్సహించడంలో నిబద్ధతగా ఉందన్నారు.  అయితే ప్రజలు అవసరాలకు అనుగుణంగా విశ్వాసం కల్పించడం కూడా ముఖ్యమే అని ఆయన అన్నారు. కాగా కంపెనీ ప్రామిస్ చేసినట్టుగా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్ల ప్రయాణ దూరం రావడం లేదని  కస్టమర్ల ఫిర్యాదు వెల్లువెత్తాయి. దీనిపై ఆప్‌ సర్కార్‌ గత నెలలోనే(ఫిబ్రవరి 8న) కంపెనీకి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనిపై  ముగ్గరు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.  కంపెనీ ఇచ్చిన రాతపూర్వక సమాధానం ఇచ్చింది అయితే టాటా మోటార్స్ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని రవాణా శాఖ తాజాగా పేర్కొంది. ఇంకా తుది నివేదిక రావాల్సి ఉందనీ, తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తలు