హామీదారు ఆస్తులపై చర్యలేమిటి?

24 Sep, 2020 06:55 IST|Sakshi

ఐబీసీ నిబంధనలను సవాలు చేస్తూ, సంజయ్‌ సింఘాల్‌ పిటిషన్‌

కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కేసు విచారణ అక్టోబర్‌ 6కు వాయిదా!  

న్యూఢిల్లీ: కంపెనీ తీసుకున్న రుణాలు తీర్చలేని సందర్భాల్లో,  ఆ రుణాలకు హామీగా ఉన్న వ్యక్తుల వ్యక్తిగత ఆస్తులను దివాలా చర్యల కిందకు తీసుకురావడం సమంజసం కాదంటూ భూషన్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ (బీపీఎస్‌ఎల్‌) మాజీ చైర్మన్‌ సంజయ్‌ సింఘాల్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు వీలు కల్పిస్తున్న ఇన్సాలెన్సీ అండ్‌ బ్యాంక్ట్రప్సీ కోడ్‌ (ఐబీసీ) నిబంధనల రాజ్యాంగ బద్ధతను, ఈ విషయంలో బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) జారీ చేసిన నోటీసును సవాలుచేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందనను తెలియజేయాలని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

  న్యాయ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖతోపాటు, ఇన్సాల్వెన్సీ  బ్యాంక్ట్రప్సీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఐబీబీఐ), ఎస్‌బీఐలకు నోటీసులు జారీ చేసిన చీఫ్‌ జస్టిస్‌ డీఎన్‌ పటేల్, జస్టిస్‌ ప్రతీక్‌ జలాన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్,  కేసు తదుపరి విచారణను అక్టోబర్‌ 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే సంజయ్‌ సింఘాల్‌ వ్యక్తిగత ఆస్తులను దివాలా చట్రంలోకి తీసుకురావడానికి సంబంధించి ఎస్‌బీఐ ఇచ్చిన నోటీసు అమలు విషయంలో మాత్రం ప్రస్తుత దశలో ‘స్టే’ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. భూషన్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ లిమిటెడ్‌కు సంబంధించి ఒకపక్క కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ పెండింగులో ఉండగానే మరోవైపు సింఘాల్‌ వ్యక్తిగత ఆస్తులపై డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ను ఎస్‌బీఐ ఆశ్రయించడం తగదని హైకోర్టులో దాఖలైన సింఘాల్‌ పిటిషన్‌ పేర్కొంది.  

అక్టోబర్‌ 6నే అనిల్‌  కేసులో తీర్పు!
అక్టోబర్‌ 6వ తేదీనే అనిల్‌ అంబానీకి సంబంధించి ఇదే తరహా దివాలా అంశంపై ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించే అవకాశం ఉండడం గమనార్హం. సంబంధిత వ్యాజ్యంలో రానున్న తీర్పు–  భూషన్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ మాజీ చైర్మన్‌ సంజయ్‌ సింఘాల్‌ దాఖలు చేసిన ప్రస్తుత పిటిషన్‌కు కూడా వర్తించే అవకాశం ఉంది. అనిల్‌ కేసు వివరాల్లోకి వెళ్తే... అడాగ్‌ గ్రూప్‌లోని ఆర్‌కామ్‌ (రూ.565 కోట్లు), రిలయన్స్‌ టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (రూ.635 కోట్లు)కు 2016 ఆగస్టులో ఎస్‌బీఐ రుణం మంజూరు చేసింది.  ఈ రుణం మొండిబకాయిగా మారడంతో, అనిల్‌ అంబానీ ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తును ఎస్‌బీఐ రుణ బాకీల కింద జప్తు చేసుకోవాలని నిర్ణయించింది. తదుపరి అనిల్‌ అంబానీకి నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ స్పందన రాలేదు.  దీనితో ఎన్‌సీఎల్‌టీ,  ముంబై బెంచ్‌ని ఆశ్రయించింది.

దివాలా ప్రక్రియకు సమాంతరంగా గ్యారెంటర్‌పై కూడా విచారణ జరపవచ్చని నిబంధనల్లో స్పష్టంగా ఉందని తన వాదనల్లో పేర్కొంది. ఈ వాదనతో ఏకీభవిస్తూ,  ఎన్‌సీఎల్‌టీ అనిల్‌ ఆస్తులపై దివాలా ప్రక్రియకు వీలుగా మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్‌పీ)ని నియమిస్తూ ఆగస్టు 21న ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు అదేనెల 27వ తేదీన స్టే ఇస్తూ,  తదుపరి విచారణను అక్టోబర్‌ 6కు వాయిదా వేసింది. కేసులో స్పందనకు కేంద్రం, ఎస్‌బీఐలకు నోటీసులు జారీ చేసింది. ఈ స్టే ఉత్తర్వు్యను ఎస్‌బీఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.  ఈ నెల 17వ తేదీన  పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు,  ఈ అంశానికి ఉన్న  ప్రాధాన్యత రీత్యా, తదుపరి విచారణలు ఏమీ లేకుండా అక్టోబర్‌ 6న కేసు విచారణను చేపట్టి తుది తీర్పు ఇవ్వాలని  ఢిల్లీ హైకోర్టుకు సూచించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు