ఢిల్లీ హైకోర్టుకు ‘యస్‌ బ్యాంక్‌ ఒత్తిడి రుణ’ బదలాయింపు వివాదం

18 Mar, 2023 03:16 IST|Sakshi

కేంద్రం, ఆర్‌బీఐ, సెబీలకు నోటీసులు  

న్యూఢిల్లీ: జేసీ ఫ్లవర్స్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి యస్‌ బ్యాంక్‌కు చెందిన  రూ. 48,000 కోట్ల స్ట్రెస్‌ అసెట్‌ (మొండి బకాయిలుగా మారే అవకాశం ఉన్న)  పోర్ట్‌ఫోలియోను బదిలీ చేయడంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ బదలాయింపుపై దర్యాప్తునకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల పిటిషన్‌పై  ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కేంద్రం, ఆర్‌బీఐ, సెబీల ప్రతి స్పందనను కోరింది.

సమాధానానికి నాలుగు వారాల గడువును ఇస్తూ, తదుపరి కేసును జూలై 14న  లిస్ట్‌ చేయాలని ఆదేశించింది. రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్యం స్వామి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.  ఈ తరహా ఒప్పందాల్లో ఎటువంటి వివాదాలకూ తావివ్వకుండా  సమగ్ర మార్గదర్శకాలను రూపొందించాలని, ఇందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని  కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐ, సెబీలను ఆదేశించాలని ఆయన ఈ పిటిషన్‌లో కోరారు.

ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ షేర్లకు సంబంధించిన మూడేళ్ల లాకిన్‌ వ్యవధి ఈ నెల 13వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. నిర్వహణపరమైన అవకతవకలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన యస్‌ బ్యాంకును 2020 మార్చిలో రిజర్వ్‌ బ్యాŠంక్‌ తన చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత రూపొందించిన ప్రణాళిక ప్రకారం తొమ్మిది బ్యాంకులు రూ. 10,000 కోట్ల చొప్పున సమకూర్చడం ద్వారా వాటాలు తీసుకుని యస్‌ బ్యాంక్‌ను నిలబెట్టాయి. అలా తీసుకున్న వాటాల్లో 75 శాతం షేర్లను మూడేళ్ల వరకూ విక్రయించకుండా లాకిన్‌ విధించారు. యస్‌ బ్యాంక్‌ షేర్‌ ఎన్‌ఎస్‌ఈలో శుక్రవారం 1 శాతం పెరిగి రూ.15.05కు చేరింది.  

మరిన్ని వార్తలు