‘నిన్న రాత్రి మా ఆంటీ చనిపోయింది’, ఫోన్ పక్కనే పెట్టుకుని పడుకుంటున్నారా?

11 Sep, 2022 19:58 IST|Sakshi

రాత్రి పూట స్మార్ట్‌ ఫోన్‌ వాడే అలవాటు ఉందా? నిద్రపోయే ముందు మొబైల్‌ను పక్కనే పెట్టుకొని పడుకుంటున్నారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త. ఇటీవల కాలంలో చైనా స్మార్ట్‌ ఫోన్‌లు పేలుతున్న వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా చైనాకు చెందిన ఓ స్మార్ట్‌ ఫోన్‌ పేలింది. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం మొబైల్‌ పేలిన ఘటన నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. 

ఢిల్లీకి చెందిన ఓ మహిళ రెడ్‌మీ 6ఏ ఫోన్‌ను వినియోగిస్తుంది. అయితే ఈ క్రమంలో ఆర్మీలో విధులు నిర్వహించే ఆమె కుమారుడితో మాట్లాడి..ఆ ఫోన్‌ను పక్కనే పెట్టుకొని పడుకుంది. ఆ మరుసటి రోజు ఆమె అల్లుడు వచ్చి చూసే సరికి బాధితురాలు రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా కనిపించింది. దీంతో తన అత్త మరణంపై ఆమె అల్లుడు మంజీత్‌ స్పందించాడు. 

‘నిన్న రాత్రి మా ఆంటీ చనిపోయింది. ఆమె రెడ్‌మీ 6ఏ వాడుతోంది. రాత్రి పడుకునే సమయంలో దిండు పక్కనే దాన్ని పెట్టుకొని పడుకుంది. మధ్య రాత్రిలో అది పేలి మా అత్త చనిపోయింది. ఇది మాకు చాలా విషాదమైన సమయం. మాకు సాయం చేయాల్సిన బాధ్యత సదరు స్మార్ట్‌ ఫోన్‌ సంస్థపై ఉంటుంది’ అని అతను ట్వీట్ చేశాడు.

అంతేకాదు పేలిన ఫోటోలు, రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయిన తన అత్త ఫోటోల్ని షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని రెడ్‌మీ కంపెనీ వెల్లడించింది.      

మరిన్ని వార్తలు