Dell Success Journey: డార్మిటరీలో మొదలైన స్టార్టప్‌.. నేడు 101 బిలియన్‌ డాలర్ల కంపెనీ

14 May, 2022 14:32 IST|Sakshi

మైఖేల్‌ డెల్‌ పేరు చెబితే ఇండియాలో ఎవరూ గుర్తు పట్టరు. ఎందుకంటే బిల్‌గేట్స్‌, ఈలాన్‌మస్క్‌, జెప్‌బేజోస్‌లాగా వార్తల్లో వ్యక్తి కాదు. కానీ డెల్‌ కంప్యూటర్స్‌ అంటే అందరికీ తెలుసు దాన్ని స్థాపించిన వ్యక్తి మైఖేల్‌ డెల్‌ అని చెబితేనే అతని గొప్పతనం అర్థం అవుతుంది. అతి తక్కువ పెట్టుబడితో కాలేజ్‌ డార్మిటరీలో అతను నెలకొల్పిన కంపెనీ ఈ రోజు కోట్లాది మంది ఇంటకి చేరింది. 

యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ విద్యార్తిగా ఉన్న రోజుల్లో  మైఖేల్‌ ‘డెల్‌’ని స్థాపించాడు.  కంపెనీ నిర్వహించేందుకు కావాల్సినంత నగదు లేకపోవడంతో ఆస్టిన్‌ నగరంలో తాను బస చేస్తున్న యూనివర్సిటీ డార్మిటరీలోనే 1984లో డెల్‌ పురుడుపోసుకుంది. ఆ రోజుల్లో మైఖేల్‌ పెట్టుబడి కేవలం వెయ్యి డాలర్లు. ఆ డబ్బుతో పాత కంప్యూటర్లను కొని అప్‌గ్రేడ్‌ చేసి రీసేల్‌ చేసే పనిని డెల్‌ నిర్వహించేది.

అమెరికాలో 80వ దశకంలోనే కంప్యూటర్ల వినియోగం పెరిగిపోవడంతో కేవలం మూడేళ్లలోనే డెల్‌ అనూహ్యమైన ప్రగతి సాధించింది. వెయ్యి డాలర్లతో పెట్టిన కంపెనీ 1987 కల్లా 159 మిలియన్‌ డాలర్ల కంపెనీగా మారింది. 90వ దశకంలో ఇంటర్నెట్‌ వినియోగం ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. అంతే ఆ తర్వాత డెల్‌ ప్రపంచమంతటా విస్తరించింది. 2021 చివరి నాటికి 101 బిలియన్‌ డాలర్ల సంస్థగా డెల్‌ ఎదిగింది. తాజాగా తన గతాన్ని విజయ ప్రస్థానాన్ని లింక్‌డ్‌ఇన్‌ల్‌ మైఖేల్‌డెల్‌ పంచుకున్నారు. 

చదవండి: ఫోర్బ్స్‌ టాప్‌ 2000లో రిలయన్స్‌ జోరు..

మరిన్ని వార్తలు