లగ్జరీ గృహాలకు తగ్గిన డిమాండ్‌

17 May, 2021 00:12 IST|Sakshi

కోవిడ్‌ నియంత్రణలోకి వస్తేనే మళ్లీ జోరు 

పరిమిత సప్లయి కారణంగా ధరల్లో కొంత వృద్ధి

న్యూఢిల్లీ: కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో నెలన్నర కాలంగా దేశంలో లగ్జరీ గృహాలకు డిమాండ్‌ తగ్గింది. గతేడాది లాగా పరిస్థితులు కొంత వరకు సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత విక్రయాలు పెరుగుతాయని రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు, కన్సల్టెంట్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరిమిత సప్లయి కారణంగా కొన్ని ప్రాంతాలలో లగ్జరీ రెసిడెన్షియల్‌ ప్రాపర్టీల ధరలు కొంత పెరుగుతాయని, మిగిలిన ప్రాంతాలలో స్థిరంగా ఉంటాయని తెలిపారు. ‘ఈ ఏడాది జనవరి–మార్చి (క్యూ1)లో మా నివాస ప్రాజెక్ట్‌లన్నీ వేగంగా, మంచి ధరల పనితీరును కనబరిచాయని’ హైన్స్‌ ఇండియా ఎండీ అండ్‌ కంట్రీ హెడ్‌ అమిత్‌ దివాన్‌ తెలిపారు. గృహ కొనుగోలుదారులు పేరున్న డెవలపర్ల నుంచి నాణ్యమైన గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కోవిడ్‌–19 తొలి దశ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లగ్జరీ, విశాలమైన గృహాలకు డిమాండ్‌ గణనీయంగా పెరిగిందని సోథెబైస్‌ ఇంటర్నేషనల్‌ రియాల్టీ సీఈఓ అమిత్‌ గోయల్‌  చెప్పారు. గతేడాది పెట్టుబడి విభాగంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం అభివృద్ధి చెందిందని, లగ్జరీ హౌసింగ్‌లో భారతీయులతో పాటు ప్రవాసులు కూడా విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నారని ఎంబసీ గ్రూప్‌ రెసిడెన్షియల్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ రీజా సెబాస్టియన్‌ తెలిపారు.

దేశంలో గత రెండేళ్లుగా రూ.3 కోట్లకు పైగా విలువ చేసే లగ్జరీ ప్రాపర్టీల ప్రారంభాలు లేవని.. నిరంతర డిమాండ్‌తో ధరల స్థిరత్వానికి దోహదం చేస్తాయని ఆమె పేర్కొన్నారు. లగ్జరీ గృహ కస్టమర్లు బ్రాండెడ్‌ డెవలపర్లు, రెడీ–టు–మూవ్‌ ప్రాజెక్ట్‌లకు, నాణ్యమైన గృహాలకు మాత్రమే ఇష్టపడతారని తెలిపారు. లగ్జరీ గృహాల కోసం హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ), ప్రవాసులు ఆసక్తిని కనబరస్తుండటంతో ఈ తరహా ప్రాజెక్ట్‌లకు నిరంతరం వృద్ధి నమోదవుతుందని చెప్పారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రవర్తన, త్వరితగతిన ప్రజలకు టీకాలు అనే అంశాల మీద ఆధారపడి రియల్టీ రంగం ఉంటుందని ప్రాప్‌టైగర్‌.కామ్‌ సీఓఓ మణి రంగరాజన్‌ అభిప్రాయపడ్డారు. అయితే ఆయా అంశాల మీద భయాలు ఉన్నప్పటికీ.. గత ఏడాది మాదిరిగా మార్కెట్‌ ప్రతికూలంలో ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే రెండు నెలలో కోవిడ్‌ నియంత్రణలోకి వస్తే గనక డిమాండ్‌ పెరుగుతుందని చెప్పారు. 

మరిన్ని వార్తలు