కరోనా ఎఫెక్ట్‌: ఆ కేటగిరి అద్దె ఇళ్లకు ఫుల్‌ డిమాండ్‌.. టూ కాస్ట్‌లీ గురూ!

22 Sep, 2022 09:10 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు పెద్ద పట్టణాల్లో ఖరీదైన ఇళ్ల అద్దెలు గడిచిన రెండేళ్లలో 8–18 శాతం మేర పెరిగాయని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ తెలిపింది. ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై మెట్రో పాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణె పట్టనాల్లో లగ్జరీ ఇళ్ల కొనుగోలు, అద్దెకు డిమాండ్‌ పెరిగినట్టు వెల్లడించింది. అత్యధికంగా ముంబైలోని వర్లి ప్రాంతంలో అద్దె 18 శాతం పెరిగింది.

2000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖరీదైన భవంతి అద్దె 2020లో నెలవారీగా రూ.2 లక్షలు ఉంటే, అది రూ.2.35 లక్షలు అయింది. బెంగళూరు జేపీ నగర్‌లో అద్దె రెండేళ్లలో 13 శాతం పెరిగి రూ.52,000 అయింది. రాజాజీ నగర్‌లో కిరాయి 16 శాతం పెరిగి రూ.65,000కు చేరింది.

ప్రముఖ లగ్జరీ హౌసింగ్‌ మార్కెట్లలో అద్దెలు గత రెండేళ్లలో రెండంకెల్లో పెరిగినట్టు అనరాక్‌ చైర్మన్‌ అనుజ్‌పురి తెలిపారు. కరోనా రెండో విడత తర్వాత పెద్ద సైజు ఇళ్లకు ప్రాధాన్యాత పెరిగినట్టు చెప్పారు. చెన్నైలోని అన్నా నగర్‌లో సగటు నెలవారీ అద్దె 13 శాతం పెరిగి రూ.63,000 అయింది. కొట్టు పురంలో 14 శాతం పెరిగి రూ.84,000కు చేరింది.

హైదరాబాద్‌లో 15 శాతం 
భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో 2,000 చదరపు అడుగుల ఇంటి నెలవారీ అద్దె రెండేళ్లలో 15 శాతం పెరిగి రూ.62,000 అయింది. ఇదే సమయంలో చదరపు అడుగు ధర 6 శాతం పెరిగి రూ.7,400కు చేరింది. హైటెక్‌ సిటీ ప్రాంతంలో సగటు నెలవారీ అద్దె 11 శాతం పెరిగి రూ.59,000 అయింది. 

చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు!

మరిన్ని వార్తలు