అపార్ట్‌మెంట్లతో పోలిస్తే ఓపెన్‌ ప్లాట్లే ముద్దు!

5 Nov, 2022 10:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటూ గుర్గావ్‌లోని కొన్ని ప్రధాన ప్రాంతాలలోని నివాస స్థలాలకు డిమాండ్‌ పెరుగుతుందని హౌసింగ్‌.కామ్‌ తెలిపింది. 2018 నుంచి ఆయా నగరాలలోని ఓపెన్‌ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని రీసెర్చ్‌ హెడ్‌ అంకితా సూద్‌ పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13-21 శాతం మేర పెరిగాయని చెప్పారు. ఇదే నగరాల్లోని అపార్ట్‌మెంట్ల ధరలలో మాత్రం 2-6 శాతం మేర వృద్ధి ఉందని తెలిపారు. ఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని ఓపెన్‌ ప్లాట్లకే డిమాండ్‌ ఎక్కువగా ఉంది. (ప్రాపర్టీలకు డిమాండ్‌. రూ 2 కోట్లు అయినా ఓకే!)

2018-21 మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుంది. శంకర్‌పల్లి, పటాన్‌చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్‌నగర్‌ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్, ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. కాగా.. చెన్నైలో ప్లాట్లలో వార్షిక వృద్ధి రేటు 18 శాతం, బెంగళూరులో 13 శాతం ఉంది. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగడం, శ్రీపెరంబుదూర్, తైయూర్‌ ప్రాంతాలలో, బెంగళూరులో నీలమంగళ, దేవనహళ్లి, చిక్కబల్లాపూర్, హోస్కేట్, కొంబల్‌గోడు ప్రాంతాల్లోని నివాస ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది. 2018-21 మధ్య ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్లాట్ల వార్షిక వృద్ధి రేటు 15 శాతంగా ఉంది. సోహ్నా, గుర్గావ్‌లో భూముల ధరలు ఏటా 6 శాతం పెరుగుతున్నాయి. (ఉడాన్‌లో రెండో రౌండ్‌ కోతలు, భారీగా ఉద్యోగులపై వేటు)

మరిన్ని వార్తలు