2021లో రికార్డు స్థాయిలో డీమాట్ ఖాతాలు ఓపెన్

27 Apr, 2021 15:15 IST|Sakshi

ముంబై: ప్రజలలో పెట్టుబడుల విషయంలో ఆలోచన తీరు మారినట్లు తెలుస్తుంది. ఎన్నడూ లేనంతగా 2020-2021 ఆర్థిక సంవ‌త్స‌రంలో రికార్డు స్థాయిలో కోటి 42 ల‌క్ష‌ల(14.2 మిలియన్) కొత్త డీమాట్ ఖాతాలు ఓపెన్ అయ్యాయి. ఇందులో ఒక్క 2021 మార్చి నెలలోనే 19 ల‌క్ష‌ల డీమాట్ ఖాతాలు ఓపెన్ అయ్యాయి. గత 2020 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఈ సంఖ్య 49 లక్షలుగా ఉంది. 2018 ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభమైన నటి నుంచి మూడేళ్లలో ఈ సగటు 4.3 మిలియన్లుగా ఉంది.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కొన్ని వ్యాపారాల‌లో స‌మ‌స్య‌లు, ఇబ్బందులు కార‌ణంగా భార‌తీయ పెట్టుబ‌డిదారులు స్టాక్ మార్కెట్‌లో కొత్త అవ‌కాశాల‌ కోసం ఎదురుచూస్తున్నారు. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం, రియల్ ఎస్టేట్, బ్యాంక్ డిపాజిట్ల వంటి వాటి మీద కాకుండా స్టాక్స్ వంటి ప్రత్యామ్నాయాల మీద పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు అర్ధం అవుతుంది. స్టాక్స్, బాండ్ల వంటి సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టడానికి డిపాజిటరీ పార్టిసిపెంట్‌తో పెట్టుబ‌డిదారుడు డీమెటీరియ‌లైజ్డ్ లేదా డీమాట్ ఖాతాను తెరవాలి. ఈ సెక్యూరిటీలు డిజిటల్ రూపంలో ఉంటాయి.

గత ఏడాది మార్చిలో జాతీయ లాక్‌డౌన్ త‌ర్వాత మార్కెట్లు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. చాలా తక్కువ ధరకే స్టాక్ లు లభించడంతో చాలా మంది డీమాట్ ఖాతాను తెరవడానికి ఆసక్తి కనబరచారు. ఆ తర్వాత 2021 ఆర్థిక సంవ‌త్స‌రంలో సెన్సెక్స్ 68 శాతం లాభం సాధించ‌గా, బీఎస్ఈ 500.. 77 శాతం పెరిగింది. చాలా కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్ విషయంలో ప్రకటనలు భారీగా ఇచ్చాయి. ఎక్కువ శాతం మంది యువ పెట్టుబ‌డిదారులు తమ పెట్టుబడులను ఇటు వైపు మళ్లించడంతో డీమాట్ ఖాతాల్లో రికార్డు స్థాయి పెరుగుద‌ల సాధ్య‌మైంది.

చదవండి: 

కరోనా దెబ్బకు తగ్గిన జీడీపీ వృద్ది రేటు

>
మరిన్ని వార్తలు