డీమోనిటైజేషన్‌ నాటి సీసీటీవీ రికార్డులు జాగ్రత్త

9 Jun, 2021 00:24 IST|Sakshi

తొలగించవద్దంటూ బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశం

ముంబై: డీమోనిటైజేషన్‌ (పెద్ద నోట్ల రద్దు) సమయంలో బ్యాంకుల శాఖలు, కరెన్సీ చెస్ట్‌ల్లోని సీసీటీవీ రికార్డులను జాగ్రత్తగా పదిలపరచాలంటూ ఆర్‌బీఐ కోరింది. ఆ సమయంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకు సహకరించేందుకు ఈ ఆదేశాలు జారీ చేసింది. 2016 నవంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 30 వరకు బ్యాంకుల్లోని సీసీటీవీ రికార్డులను జాగ్రత్తపరచాలని కోరింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు 2016 నవంబర్‌ 8న ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే. నల్లధనం గుర్తింపు, నకిలీ నోట్ల ఏరివేత లక్ష్యాలతో నాడు ఆ కార్యక్రమాన్ని చేపట్టినట్టు కేంద్రం ప్రకటించుకుంది.

ఇందులో భాగంగా రద్దు చేసిన పెద్ద నోట్లను బ్యాంకు శాఖల్లో మార్చుకునేందుకు అదే ఏడాది డిసెంబర్‌ 30 వరకు అవకాశం ఇచ్చింది. దాంతో బ్యాంకు శాఖల వద్ద భారీ క్యూలు చూశాము. రద్దు చేసే నాటికి రూ.500, రూ.1,000 నోట్ల రూపంలో వ్యవస్థలో రూ.15.41 లక్షల కోట్లు చలామణిలో ఉంటే, బ్యాంకుల్లోకి రూ.15.31 లక్షల కోట్లు వచ్చాయి. పెద్ద ఎత్తున నల్లధనాన్ని కలిగిన వారు సైతం అక్రమ మార్గాల్లో తెల్లధనంగా (సక్రమమైనదిగా) మార్చుకున్నారనే విమర్శలున్నాయి. దీనిపైనే దర్యాప్తు ఏజెన్సీలు విచారణ చేపట్టాయి. దర్యాప్తునకు సహకరించేందుకు వీలుగా సీసీటీవీ రికార్డులను జాగ్రత్తగా ఉంచాలని గతంలోనూ ఆర్‌బీఐ కోరింది. ఇప్పుడు మరో విడత సీసీటీవీ రికార్డులను నిర్వీర్యం చేయరాదంటూ ఆర్‌బీఐ తాజాగా బ్యాంకులను ఆదేశించింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు